iDreamPost
iDreamPost
ఏ రంగంలోనైనా నిరంతరాయంగా పనిచేయడం కష్టసాధ్యం. దానికి వయస్సు, పరిస్థితులు, కాలానుగుణంగా వచ్చే మార్పులు సహకరించవు. ఉద్యోగాల్లో అయితే 60 ఏళ్ల వయస్సు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు దీన్ని 62 కు పొడిగించాయి. అయితే రాజకీయాలకు వయస్సుతో పనిలేదు. పార్టీ, ప్రజల్లో నమ్మకం ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉన్నాయి. పదవులు చేపట్టే విషయంలో సీపీఎం, బీజేపీ వంటి ఒకటి రెండు పార్టీలు వయస్సు నిబంధన అమలు చేస్తున్నా అధికశాతం పార్టీల్లో ఈ నిబంధన లేదు.
అయినా అంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనజాలడం కష్టమే. కొందరే దీనికి మినహాయింపు. తొమ్మిది పదుల వయస్సు దాటినా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు దేశంలో నలుగురు నేతలే ఉన్నారు. కేరళలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు ఉండగా పంజాబుకు చెందిన ఒక కురువృద్ధుడు 95 ఏళ్ల ముదిమిలోనూ చట్టసభ మెట్లు ఎక్కేందుకు ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఆ నలుగురిలో ముగ్గురు సీఎంలే
90 ఏళ్లు దాటినా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు నలుగురు ఉండగా.. వారిలో ముగ్గురు నేతలు ముఖ్యమంత్రులుగా పనిచేయడం విశేషం.
-99 ఏళ్ల వయస్సులోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత కేరళకు చెందిన మహిళా నాయకురాలు కేఆర్ గౌరికి దక్కుతుంది. 1919లో జన్మించిన ఆమె 1952 నుంచి 2011 వరకు సీపీఎం తరఫున 16 సార్లు పోటీ చేసి 13 సార్లు ఎమ్మెల్యే అయ్యారు.
-కేరళకే చెందిన సీపీఎం నేత మాజీ సీఎం అచ్యుతానందన్ 92 ఏళ్ల వయస్సులో 2016 ఎన్నికల్లో గెలిచి మరోసారి సీఎం పదవి రేసులో నిలిచారు. అయితే వయస్సు రీత్యా ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని పార్టీ నిర్ణయించడంతో మరికొంత కాలం సీఎంగా పనిచేసే అవకాశం కోల్పోయారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Also Read : రేవంత్ లో ఇంత మార్పా…?కేసిఆర్ మీద కోపమా? మోడీ మీద ప్రేమనా?
-తమిళనాడు దిగ్గజ నేత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా 94 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా చేశారు. 2016 ఎన్నికల్లో ఆయన పార్టీ డీఎంకే ఓడిపోవడంతో అప్పటికే సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన ఆయన మరో టర్మ్ ఆ పదవి చేయలేకపోయారు. ఎమ్మెల్యేగానే దివంగతులయ్యారు.
1957 నుంచి ఎమ్మెల్యేగా బాదల్
ఇక ప్రస్తుత పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన 95 ఏళ్ల ప్రకాష్ సింగ్ బాదల్ 65 ఏళ్లుగా చట్టసభల సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1927 డిసెంబరులో జన్మించిన ఆయన 1947 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తన స్వగ్రామమైన బాదల్ సర్పంచిగా మొదట ఎన్నికయ్యారు. తర్వాత నాలుగేళ్లు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి 10 సార్లు ఎమ్మెల్యే అయ్యారు.
ప్రస్తుతం లాంబి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇప్పుడు అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. శిరోమణి అకాలీదళ్ కు చెందిన ఆయన 1970లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఏడాది పనిచేశారు. 1977లో కొన్ని నెలలు కేంద్రమంత్రి గా ఉన్న ఆయన రెండోసారి సీఎం అయ్యారు. 1997-2002, 2007-12, 2012-17 మధ్య.. మొత్తంగా 20 ఏళ్లు సీఎంగా వ్యవహరించారు. 2017 ఎన్నికల్లో అకాలీ-బీజేపీ కూటమి ఓడిపోవడంతో ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు.
ఈ వయస్సులోనూ ఉద్యమ స్ఫూర్తి
వయస్సు మీద పడిన ప్రకాష్ సింగ్ బాదల్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా సరే.. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రంతో విభేదించి ఎన్డీయే నుంచి ఆకాలీదళ్ ను బయటకు తీసుకొచ్చేశారు. 2015లో ప్రభుత్వం ఇచ్చిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని సైతం 2020లో వెనక్కి ఇచ్చేసి రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. ప్రజల్లో ఇప్పటికీ అపారమైన పట్టున్న ఆయన మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు.
Also Read : ఎందరు ప్రధానులు బడ్జెట్ ప్రవేశపెట్టారో తెలుసా?