Idream media
Idream media
ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. అది అక్షర సత్యమని బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ దంపతుల రాజకీయ విజయగాధను పరిశీలిస్తే తెలుస్తుంది. బూచేపల్లి… ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఆర్టీసీ కండక్టర్ స్థాయి నుంచి వ్యాపారం, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగినా..మూలాలు మరచిపోని కుటుంబం బూచేపల్లిది. తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో దర్శి నుంచి జడ్పీటీసీగా ఎకగ్రీవంగా ఎన్నికైన బూచేపల్లి వెంకాయమ్మ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు.
భర్త విజయంలో కీలక పాత్ర..
బూచేపల్లి సుబ్బారెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత గ్రానైట్ వ్యాపారంలోకి ప్రవేశించారు. 2004 ఎన్నికల్లో దర్శి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సానికొమ్ము పిచ్చిరెడ్డికే దక్కింది. ప్రజల్లో తనకు మంచి పేరు ఉన్నా.. కాంగ్రెస్ అధిష్టానం సానికొమ్ము వైపే మొగ్గుచూపడంతో బూచేపల్లి మిన్నుకుండిపోయారు. ఈ సమయంలో కలుగజేసుకున్న బూచేపల్లి వెంకాయమ్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భర్తను కోరింది. స్వతహాగా నెమ్మదస్తుడైన సుబ్బారెడ్డి.. తన సతీమణి చేసిన సూచనపై ఆచితూచి అడుగులేస్తున్న తరుణంలో.. వెంకాయమ్మ తనదైన శైలిలో ఒత్తిడి తెచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారా..? లేక తనను చేయమంటారా..? అంటూ భర్తను ఎన్నికల రంగంలోకి దింపింది.
Also Read : బోయ గిరిజమ్మ జెడ్పీ చైర్మన్ కావటానికి నాటి పసుపు కుంకుమ పోరాటమే కారణమా?
ఎన్నికల్లోనూ వెంకాయమ్మ క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హవాలోనూ దర్శిలో బూచేపల్లి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. దీంతో బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి పేరు జిల్లాలో మారుమోగిపోయింది.
కుమారుడును ఎమ్మెల్యే చేసి..
భర్తనే కాదు కుమారుడును కూడా వెంకాయమ్మ ఎమ్మెల్యేను చేశారు. 2006 పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచి.. చీమకుర్తి ఎంపీపీగా పని చేస్తున్న కుమారుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేత రాజీనామా చేయించి 2009 ఎన్నికల్లో భర్తకు బదులు దర్శి నుంచి ఎన్నికల బరిలో నిలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ శివప్రసాద్ రెడ్డి విజయబావుటా ఎగురవేశారు. కుమారుడు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో.. అప్పటి వరకు అతను నిర్వర్తించిన ఎంపీపీ బాధ్యతలను వెంకాయమ్మ చేపట్టారు.
Also Read : విశ్వాసానికి అందలం.. దళిత మహిళా నేతకు జెడ్పి పదవి
2019 ఎన్నికలకు దూరంగా..
2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శివప్రసాద్ రెడ్డి టీడీపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు చేతిలో 1,374 స్వల్ల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తండ్రి సుబ్బారెడ్డి అనారోగ్యం కారణంగా 2019 ఎన్నికల్లో శివ ప్రసాద్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. తమ బదులు మద్ధిశెట్టి వేణుగోపాల్‌ను వైసీపీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. మద్ధిశెట్టి గెలుపునకు పని చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇస్తామని నాడు వైఎస్ జగన్ బూచేపల్లికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే తాజాగా జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని బూచేపల్లి కుటుంబానికే కేటాయించారు. ప్రకాశం జిల్లా పరిషత్ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో బూచేపల్లి వెంకాయమ్మ ఆ పదవిని చేపట్టారు.
Also Read : ఇచ్చిన మాటకు కట్టుబడి ‘శ్రీనివాసులు’కు పట్టం కట్టిన జగన్
వైసీపీ క్యాడర్‌లో జోష్..
ఎంత ఎదిగినా మూలాలు మరచిపోని కుటుంబం బూచేపల్లిది. తాను ఆర్టీసీ కండక్టర్‌గా పని చేసిన ఒంగోలు బస్ డిపోలో సిబ్బంది సౌకర్యార్థం బూచేపల్లి విశ్రాంతి భవనాన్ని నిర్మించి ఇచ్చారు. బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ ట్రస్ట్ పేరుతో ప్రకాశం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణలు అంటని బూచేపల్లి కుటుంబం నుంచి వెంకాయమ్మ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికవడంతో వైసీపీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది.
Also Read : నాడు ఎమ్మెల్యే పదవి మిస్ ,నేడు జడ్పీ చైర్మన్