iDreamPost
iDreamPost
అంతా సవ్యంగా ఉండి టీజర్ మీద ఎలాంటి నెగటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోయి ఉంటే ఆది పురుష్ ఈ సంక్రాంతి జనవరి 12న విడుదలైపోయేది. కానీ విఎఫ్ఎక్స్ మీద వచ్చిన విమర్శలు నిర్మాతల నిర్ణయాన్ని మార్చేసింది. దానికి తోడు రావణుడు హనుమంతుడు గెటప్స్ కి సంబంధించి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో తీరిదిద్దిన విధానం విమర్శలకు తావివ్వడంతో నిర్మాణ సంస్థ టి సిరీస్ తన డెసిషన్ మార్చుకుని రిలీజ్ ని వాయిదా వేసుకుంది. చెప్పుకోవడానికి జూన్ కైతే వెళ్లిపోయారు అప్పుడూ వస్తుందన్న గ్యారెంటీ లేదు. కొత్తగా చేస్తున్న పోస్ట్ ప్రొడక్షన్ కోసం అదనంగా వంద కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినా అది ఏ మాత్రం సరిపోలేదని సమాచారం.
ఒకరకంగా చూస్తే ఆది పురుష్ బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసుకుంది. ఎందుకంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచిన వాల్తేరు వీరయ్యలో ఉన్నది రెగ్యులర్ కంటెంటే. కాకపోతే వింటేజ్ చిరంజీవిని చూపించిన తీరు, కామెడీ, ఫైట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ పూర్తిగా దెబ్బేసిన వీరసింహారెడ్డి సైతం సెలవులను క్యాష్ చేసుకుంటూ సొమ్ములు రాబడుతోంది. వారసుడు, తెగింపులకు రెస్పాన్స్ సోసోగా ఉన్నా కలెక్షన్లు డీసెంటే. ఆది పురుష్ కనక వచ్చి ఉంటే ఖచ్చితంగా వీటిలో ఒకటో రెండో తప్పుకునేవి. అప్పుడు ప్రభాస్ కు విశ్వరూపం చూపించే అవకాశం దక్కేది. అసలే రాముడి సెంటిమెంట్. కనెక్ట్ అయితే చాలు కనక వర్షమే
మిస్ చేసుకున్న మరో విషయం ఏంటంటే బాలీవుడ్ నుంచి జనవరి మొదటి రెండు వారాల్లో ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ రిలీజ్ రాలేదు. నార్త్ థియేటర్లు చాలా డల్ గా ఉన్నాయి. వాల్తేరు వీరయ్య, వరిసులను హిందీలో డబ్ చేసి వదలడానికి ఇదే కారణం. ఒకవేళ ప్రభాస్ రేస్ లో ఉంటే టోటల్ కంట్రోల్ తనకే వచ్చేది. 25న పఠాన్ ఉన్నా సరే రెండు వారాల గ్యాప్ లో భీభత్సం సృష్టించవచ్చు. ఒకవేళ అది పురుష్ కు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే దాన్ని ఆపడం ఎవరి తరం అయ్యేది కాదు. క్వాలిటీ మీద సరైన సమయంలో దర్శకుడు ఓం రౌత్ దృష్టి పెట్టకపోవడం వల్ల వచ్చిన చిక్కిది. జూన్ లో వచ్చినా ఇంకెప్పుడైనా సంక్రాంతిని మిస్ చేసుకోవడం డార్లింగ్ కి లాసే