iDreamPost
android-app
ios-app

Power crisis విద్యుత్ సంక్షోభం, విపక్ష టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటీ

  • Published Oct 17, 2021 | 2:07 AM Updated Updated Mar 11, 2022 | 10:38 PM
Power crisis విద్యుత్ సంక్షోభం, విపక్ష టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటీ

విశ్వమంతా విద్యుత్ కొరత వేధిస్తోంది. వివిధ కారణాలతో మనదేశంలోనూ ఈ సమస్య ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయి. ఏపీలో కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందేమోననే ఆందోళనతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. దేశంలోనే అందరికన్నా ముందుగా సీఎం జగన్ స్పందించారు. నేరుగా ప్రధానికి లేఖ రాశారు. అదనపు బొగ్గు ర్యాక్స్ పంపించాలని, గ్యాస్ సరఫరా చేస్తే గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు కోసం అదనపు నిధులు కేటాయించారు. కోతలు లేకుండా రాష్ట్ర ప్రజలను గట్టెక్కించే లక్ష్యంతో సాగుతున్నారు.

ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించే యత్నంలో ఉన్నప్పుడు విపక్షం విలువైన సూచనలు చేస్తే అందరూ హర్షిస్తారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తోడ్పడితే జనం గుర్తిస్తారు. కానీ టీడీపీ నేతల వ్యవహారం దానికి విరుద్ధంగా ఉంది. ఏపీలో విద్యుత్ కోతలంటూ లేని వాటిని ఊహించుకుని ఊకదంపుడు ప్రచారం చేస్తోంది. గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. ఇక దసరా తర్వాత రాష్ట్రంలో చీకట్లేనంటూ ప్రజలను ఆందోళనకు గురిచేసే ప్రయత్నమూ చేసింది. కానీ తీరా చూస్తే ఏపీలో విద్యుత్ సరఫరాలో ఆటంకం చాలా నామమాత్రంగా ఉంది. అది కూడా పీక్ సమయంలో కొద్ది సమయం పాటు గ్రామాల్లో మాత్రమే విద్యుత్ సరఫరాకి ఆటంకం కలుగుతోంది. దానికి మించి సమస్య విస్తరించకుండా సర్కారు జాగ్రత్తలు పడింది.

ప్రభుత్వం బహిరంగమార్కెట్లో అదనపు ధర చెల్లించి సైతం విద్యుత్ కొనుగోలు చేస్తోంది. దానికి ఏపీ ప్రభుత్వం అదనపు నిధులు కూడా కేటాయించారు. సమస్య నుంచి గట్టెక్కడమే లక్ష్యంగా వీలయిన అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ విపక్షం మాత్రం మొదట కరెంటు కోతలంటూ గగ్గోలు పెట్టింది. తమ మాటలన్నీ కోతలేనని జనం గుర్తిస్తుండడంతో ఇప్పుడు స్వరం మార్చేస్తోంది. ఎక్కువ ధరకు కరెంటు కొనేస్తున్నారంటూ కొత్త రాగం అందుకుంది. కరెంటు డిమాండ్ కి సరపడా సరఫరా లేదన్నది వాస్తవం. ఉత్పత్తిలో వచ్చిన సమస్య దానికి మూలం. అధిగమించాలంటే రెండు మార్గాలు మాత్రమే ఉంటాయి. ఒకటి కరెంటు కోతలు. రెండు అధిక ధరకయినా కొని అందించడం. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు సమస్య లేకుండా చూడడమే లక్ష్యంగా సాగుతోంది.

Also Read : Power Cuts – కరెంటు పేరుతో విపక్షం కోతలు, విస్మయంతో సామాన్యులు

కానీ విపక్షం మాత్రం కరెంటు లేదని గగ్గోలు పెడుతూనే కరెంటు ఎక్కువ రేటుకి కొని ఇస్తున్నారంటూ మరో ఆరోపణ కూడా చేస్తోంది. అసలు టీడీపీ నేతల బాధ ఏమిటోనన్నది జనాలకు అర్థంకాకుండా ఉంది. అసలు కరెంటు కొనకూడదా, మార్కెట్లో ధరలకు తగ్గట్టుగా కొని ప్రజలకు అందించకూడదా వాళ్ల సమస్య ఏమిటోనన్నది స్పష్టత లేదు. విద్యుత్ సరఫరా లేకపోతే ప్రజలకు సమస్య..కొని ప్రజలకు కోతలు లేకుండా చూడడం టీడీపీకి సమస్య అన్నట్టుగా మారింది. ప్రభుత్వం మాత్రం తన ప్రయత్నాలు చేస్తోంది. విపక్షాల విడ్డూరపు వాదనలను పక్కన పెట్టి జనాలకు విద్యుత్ సంక్షోభ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.