iDreamPost
android-app
ios-app

ప్రముఖ రచయిత్రి, శివ‌రాజు సుబ్బ‌ల‌క్ష్మి కన్నుమూత..

ప్రముఖ రచయిత్రి, శివ‌రాజు సుబ్బ‌ల‌క్ష్మి కన్నుమూత..

ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు. వృద్దాప్య సమస్యలతో స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌తో బాధ పడుతున్న సుబ్బలక్ష్మి బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శివరాజు సుబ్బలక్ష్మికి ప్రముఖ రచయిత బుచ్చిబాబు(శివరాజు వెంకట సుబ్బారావు)తో వివాహం అయింది.

శివరాజు సుబ్బలక్ష్మి ద్రోణంరాజు సూర్యప్రకాశరావు, సత్యవతి దంపతులకు సెప్టెంబరు 17, 1925 న జన్మించారు. ఆమెకు ప్రముఖ రచయిత బుచ్చిబాబుతో 1937 లో వివాహం అయింది. భర్త బుచ్చిబాబు ఇచ్చిన స్పూర్తితో రచనల్లో తనదైన ముద్ర వేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చిత్రకారుడు,కార్టూనిస్ట్, బాపు గారికి సుబ్బలక్ష్మి పిన్ని అవుతారు. బొమ్మలు గీయడంలో సుబ్బలక్ష్మికి బాపు తన విలువైన సలహాలు సూచనలు ఇవ్వడంతో చిత్రాలను గీయడంలో కూడా ప్రతిభ చూపించారు. ఆమె రాసిన వాటిలో కావ్యసుందరి కథ,ఒడ్డుకు చేరిన కెరటం,మనోవ్యాధికి మందుంది,మగతజీవి చివరిచూపు,శివరాజు సుబ్బలక్ష్మి కథలు పాఠకుల ప్రశంసలు పొందాయి. అదృష్టరేఖ,నీలంగేటు అయ్యగారు,తీర్పు అనే నవలలు కూడా రాశారు.

సుబ్బలక్ష్మి రాసిన కథలు మధ్యతరగతి మహిళల జీవితాల చుట్టూ, సమస్యలను ఎదుర్కోవడానికి వారు చేసిన పోరాటాలను ప్రతిబింబిస్తాయి. బెంగ‌ళూరులో బన్నెర్‌ఘాట్‌లో త‌న మేన‌ల్లుని ఇంట్లో నివాసం ఉంటున్న సుబ్బలక్ష్మి అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కానీ వృద్దాప్య సమస్యల కారణంగా ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాహిత్య రంగంలో సేవలకు గాను ఆమెకు గృహలక్ష్మి స్వర్ణకంకణం,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం,తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం బహూకరించాయి.