iDreamPost
android-app
ios-app

ఊహించినదే జరుగుతోంది

  • Published Dec 17, 2020 | 2:55 AM Updated Updated Dec 17, 2020 | 2:55 AM
ఊహించినదే జరుగుతోంది

కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ విషయంలో ఊహించినదే జరుగుతోంది. ఒక పక్క డబ్లు్యహెచ్‌వో లాంటి సంస్థలు ముందుగానే నెత్తీనోరు కొట్టుకుంటున్నప్పటికీ ధనిక దేశాలు మాత్రం చెవికెక్కించుకోవడం లేదన్నది బైటపడింది. కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ కోసం విపరీతంగా పోటీపడుతున్నాయి. ఈ వ్యాక్సిన్‌ను రెండు సార్లు తీసుకోవాల్సి ఉండడంతో తమ జనాభాకంటే అత్యధికంగా డోస్‌లను ముందుగానే కొనుగోలు, నిల్వ చేసుకుంటున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నారు. దీంతో భూమ్మీద ఉన్న జనాభాలో అత్యధికంగా ఉన్న పేదలకు ఇప్పటికప్పుడే వ్యాక్సిన్‌ అందేందుకు అవకాశం లేకుండా పోతోందంటున్నారు.

ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్న వ్యాక్సిన్‌లు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఇప్పటికే వెలువడిన పలు వ్యాక్సిన్ల కోసం అభివృద్ధి చెందిన దేశాలు తీవ్రంగానే పోటీపడుతున్నాయి. భవిష్యత్తులో వ్యాక్సిన్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు మాత్రం పేద దేశాల్లోని ప్రజలకు అందడం తీవ్ర ఇబ్బందికరంగా మారుతోందంటున్నారు. ఇప్పుడు వెలువడుతున్న గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిస్థాయిలో పనిచేసే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ రానున్న రెండేళ్ళలోల కూడా అయిదొంతుల జనాభాకు కూడా అందుబాటులో వచ్చే వీలులేదని తేల్చేస్తున్నారు.

ధనిక దేశాలు తమ ప్రజల సంఖ్యకంటే కొన్ని రెట్లు అధికంగా వ్యాక్సిన్‌లను కొనుగోలు చేసి నిల్వ చేసుకునేందుకు పోటీలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్‌ ధరలు కూడా దిగిరావడం లేదని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బైటకు వచ్చిన వ్యాక్సిన్‌ల పనితీరు ఎంత శాతం అన్నదానిపై భిన్నకథనాలే వినవస్తున్నాయి. అయినప్పటికీ ధనికదేశాలు వ్యాక్సిన్‌ కొనుగోలుకు పోటీపడడం విస్మయాన్ని కలిగిస్తోందంటున్నారు.

వైరస్‌ సంబంధిత వ్యాధులను ఏదో ఒక ప్రాంతం వారు మాత్రం నియంత్రించాలనుకుంటే సాధ్యం కాదని ఇప్పటికే వైద్యనిపుణులు స్పష్టం చేసారు. వ్యాక్సిన్‌ అత్యవసరం అయినవారికి ప్రపంచ వ్యాప్తంగా వినియోగించడం ద్వారానే వీటిని నియంత్రించగలుగతుతామన్నవా వారి అంచనాగా ఉంది. అయితే అందుకు భిన్నంగా ధనికదేశాలు వ్యవహరిస్తుండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వ్యాక్సిన్‌ కొనుగోలుదార్లలో అతి పెద్ద కొనుగోలుదారు భారతదేశమే. అయితే 49శాతం మందికి వ్యాక్సిన్‌లను మనదేశం కూడా కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఎన్ని వ్యాక్సిన్‌లను కొని నిల్వ చేసుకున్నప్పటికీ ప్రాధాన్యతా క్రమంలో మాత్రమే ఆయా దేశాల ప్రజలకు వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతించనున్నారు. ముందుగా ఆరోగ్య సిబ్బంది, వృద్ధులు వంటి వారికి వ్యాక్సిన్‌ వేస్తారు. ఆ తరువాత క్రమంలో అవసరమైన మిగిలిన వారికి అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల పరిమితులను బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.