సుప్రీం లాయర్లపై మరోసారి పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయం

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్తైన నాటి నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనపై స్కిల్ స్కాంతో పాటు ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులను నమోదు చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేయగా.. వాటిని కొట్టేసింది. అలాగే ఇదే కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. కాగా, ఈ మొత్తం పరిణామంలో చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. ఎటు చూసినా వైఫల్యమే ఎదురౌతుంది. ఇరు పక్షాల తరుఫు న్యాయవాదులు హోరా హోరీగా వాదనలు వినిపిస్తున్నారు. అయితే ప్రభుత్వ లాయర్లు చేస్తున్న వాదనలు బలంగా ఉండటంతో కోర్టు వారి వైపే మొగ్గు చూపుతోంది.

కాగా, చంద్రబాబు రిమాండ్ తరలించడం దగ్గర నుండి ఇప్పుడు బెయిల్ పిటిషన్ రద్దు వరకు.. వాదనల్లో ప్రభుత్వం తరుఫున  కీలక పాత్ర పోషించారు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. గతంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం తరుఫున ఎన్నో వాదనలు చేశారు పొన్నవోలు.. మరో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్. కానీ చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడంతో వీరూ ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. కానీ చంద్రబాబు కేసుల్లో మాత్రం పొన్నవోలుదే పై చేయి సాధిస్తున్నారు. చంద్రబాబును రిమాండ్ తరలించడంలో బలమైన వాదనలు చేశారు. కోట్లు పెట్టి తీసుకు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా లాంటి వారిపైనే విజయం సాధించారు. లూద్రాతో పాటు హరీష్ సాల్వే, మరో ఇద్దరు ముగ్గురు లాయర్లు తోడై.. వాదనలు చేస్తున్నప్పటికీ.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనల ముందు తేలిపోతున్నారు.

తాజాగా హైకోర్టులో బెయిల్, కస్టడీ వంటి పిటిషన్లపై కూడా సిద్దార్థ్ లూద్రాతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వంటి వారు వాదనలు చేశారు. సీఐడీ తరుఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే కస్టడీ పిటిషన్‌ను కొట్టి వేసింది. జగన్ ప్రభుత్వం తరుఫున కొన్ని కేసుల్లో వాదనలు వినిపించి.. ఓడిపోయిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఇప్పుడు వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా శ్రీరామ్‌తో పాటు పొన్నవోలు వాదించారు. ఇవి కూడా కొట్టివేసింది హైకోర్టు. దీనిని బట్టి చూస్తే.. కోట్లు తీసుకుంటూ వాదిస్తున్న న్యాయవాదులపై.. లక్షలు తీసుకునే పొన్నవోలు సాధించిన విజయంగా పేర్కొనవచ్చు.

Show comments