iDreamPost
android-app
ios-app

రెమ్‌డెసివిర్‌పై ‘మహా’ రాజకీయాలు

రెమ్‌డెసివిర్‌పై ‘మహా’ రాజకీయాలు

కరోనా కేసులు, టీకాలు, మందులు.. రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది పరిస్థితి. కరోనా విజృంభణ ఓ వైపు, దానిపై అధికార, విపక్షాల రాజకీయాల మరోవైపు రాజుకుంటున్నాయి. వ్యాక్సిన్‌ కొరత రెమిడెసివిర్‌ నిల్వలు లేవని మాట్లాడదామంటే ప్రధాని ఫోన్‌ ఎత్తట్లేదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఆరోపణలు చేసిన మర్నాడే మరో రాద్దాంతం మొదలైంది. రెమిడెసివిర్‌ వయల్స్‌ భారీ ఎత్తున లభ్యం కావడం, వాటిని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ తెప్పించడంపై మహారాష్ట్రలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.

అనుమతులు తీసుకునే తెచ్చాం

ఈ నెల 17న ముంబై పోలీసులు 60 వేల రెమిడెసివిర్‌ వయల్స్‌ను సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీకేసీ పోలీసులు దర్యాప్తు చేశారు. కేసు నమోదు చేయకున్నా.. వాటిని సరఫరా చేసిన డామన్‌కు చెందిన బ్రక్‌ ఫార్మా అధికారులను పిలిపించి విచారించారు. దీంతో దేవేంద్ర ఫడణవీస్‌ స్వయంగా రంగంలోకి దిగారు. అదే రోజు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, ఆహార, ఔషధ పరిపాలన విభాగం (ఎఫ్‌డీఏ) నుంచి అనుమతులు తీసుకున్నాకే.. వాటిని డామన్‌ నుంచి తెప్పించామని వివరణ ఇచ్చారు. పోలీసులు మాత్రం.. ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్స్‌ మేరకే దాడులు చేశామని, అనుమతులు, సరఫరాపై తమకు ముందుగా సమాచారం అందించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

నల్లబజారుకు తరలించేందుకే అంటూ

కాగా.. ఇప్పుడు విపక్షాలు ఈ అంశంపై ఫడణవీస్‌పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆ ఇంజక్షన్లను నల్లబజారుకు తరలించేందుకే తెప్పించారని ఎన్సీపీ మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే శిరీష్‌ చౌధరి దాదాపు 20 వేల వయల్స్‌ను ఈ నెల 8, 12 తేదీల్లో నల్లబజారులో విక్రయించారన్నారు. ‘‘నందర్బార్‌, ధూలే, జల్‌గావ్‌ జిల్లాల్లోని బ్లాక్‌ మార్కెట్‌లలో రెమ్‌డెసివిర్‌ నిల్వలను చౌధరి విక్రయించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని నందర్బార్‌ కలెక్టర్‌కు, ఎఫ్‌డీఏ కమిషనర్‌కు లేఖలు రాశాను’’ అని వెల్లడించారు. తాజాగా పట్టుబడ్డ 60వేల వయల్స్‌ను కూడా బ్లాక్‌మార్కెట్‌ కోసమే తెప్పించారని ఆరోపించారు.

అది చట్టవిరుద్ధం

పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు కూడా రెమ్‌డెసివిర్‌ పోలీసులు చేసింది సరైందేనని వేర్వేరు ప్రకటనల్లో అన్నారు. కాగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఈ అంశంపై సీరియస్‌గా స్పందించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు వితరణలు చేయలేవని పేర్కొంది. అది చట్టవిరుద్ధమని ఆప్‌ జాతీయ అధికార ప్రతినిధి ప్రీతి శర్మ మీనన్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ఓ వైపు ఈ వివాదం చెలరేగుతుండగా.. మహారాష్ట్ర సర్కారు ఎఫ్‌డీఏ కమిషనర్‌ అభిమన్యు కాలేపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో 2004 బ్యాచ్‌కు చెందిన పరిమల్‌ సింగ్‌ను నియమించింది.