Idream media
Idream media
పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల వాతావరణంలోకి వెళ్లిపోయాయి. అయితే బహిరంగ ప్రచారాలేవీ చేపట్టకపోయినా ఆయా పార్టీల మధ్య వార్ నడుస్తుంది. ప్రధానంగా అధికార తృణముల్ కాంగ్రెస్, బిజెపి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అందులో ప్రధానంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనార్జీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య గత కొంత కాలంగా వార్ జరుగుతుంది. ఎందుకంటే బిజెపి తరపున అమిత్ షానే ఎన్నికల వ్యూహాలు రచిస్తారు. అందుకనే ఆయనే నేరుగా రంగంలోకి దిగి మమతా బెనర్జీ పై విమర్శలు చేస్తున్నారు. అమిత్ షా విమర్శలకు మమతా కూడా అదే రీతిలో దీటుగా ప్రత్యావిమర్శలు చేస్తుంది.
పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార తృణముల్ కాంగ్రెస్, కేంద్రంలోని అధికారం పక్షం బిజెపి కరోనా సమయంలో కూడా రాజకీయాలకు తెరలేపాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెంగాల్ వలస కూలీలు తిరిగి రావడం వల్ల వైరస్ మరింత విస్తరిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పరిస్థితి నియంత్రణలో ఆమె విఫలమయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ మేరకు గతంలో ఆమెకు ఏకంగా లేఖ రాశారు. కేంద్ర హోం మంత్రి రాసిన లేఖపై మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్ర హోం శాఖతో భేటీ సందర్భంగా తాను ఆయన్ను నిలదీశానని మమత విలేకరుల సమావేశంలో చెప్పడంతో మరో సంచలనానికి దారిసింది.
కరోనా సమస్యను ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం విఫలమైందనుకుంటే అమిత్ షాయే వచ్చి నిర్వహించుకోవచ్చని చెప్పానని మమతా అన్నారు. ‘‘కేంద్రమే లాక్‌డౌన్ ప్రకటించింది. కానీ రైళ్లు, విమానాలు నడుపుతోంది. ఇలాగైతే ప్రజల పరిస్థితేంటి’’ అని నిల దీశానన్నారు. కాగా.. కార్మికుల పట్ల తన బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని బిజెపి మండిపడింది. అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలోపే వస్తున్నందున ఈ వ్యవహారం భావోద్వేగ అంశంగా మారింది. దీంతో 15 రోజుల్లో వలస కూలీలందరినీ వెనక్కి తీసుకొస్తామని మమత ప్రకటించారు.
అయితే 2019 సాధారణ ఎన్నికలు అయిన తరువాత నుంచి టిఎంసి, బిజెపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆ ఎన్నికల్లో బిజెపి గణనీయమైన సీట్లు సాధించింది. దీంతో వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మమతాను కోటను ఆక్రమించుకోవాలని బిజెపి చూస్తోంది. దాంతో 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందే నుంచే బిజెపి బెంగాల్‌లో ప్రతి అంశాన్ని పెద్దది చేసి కేంద్ర స్థాయిల్లో రచ్చ రచ్చ చేస్తుంది. చిన్న చిన్న అంశాలను, రాష్ట్రంలోని చర్చించాల్సిన అంశాలను కూడా పార్లమెంట్‌లో లేవనెత్తి చర్చకు లేవదీస్తున్నారు. దీంతో బిజెపి బెంగాల్‌పై దృష్టి పెట్టిందని స్పష్టం చేస్తుంది.
ఈ నేపథ్యంలో వచ్చిన కరోనాను కూడా తమ రాజకీయాల కోసం బిజెపి, తృణముల్ కాంగ్రెస్ ఉపయోగించుకుంటున్నాయి. ఆయా పార్టీలు పంతాలకు పోయి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. బెంగాల్‌కు కరోనాతో పాటు ఇటీవలి వచ్చిన ఇంఫాన్ తుఫాన్ కూడా తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్ నష్టాలు, తుఫాన్ నష్టాలతో సతమతమవుతున్న బెంగాల్‌ను ఆదుకోవడంలో రెండు పార్టీలకు ప్రణాళిక లేదు. ఇలాంటి సందర్భంలో ఆ రాష్ట్రానికి సాయం చేయాల్సిన కేంద్రంలోని మోడీ సర్కార్ మౌనంగా ఉంది. అయితే వచ్చే ఏడాది ఎన్నికల ఉన్న నేపథ్యంలో తుఫాన్ సందర్శనకు ప్రధాని మోడీ వెళ్లారు.
అయితే కరోనా ప్రారంభం నుంచే బెంగాల్‌లో రాజకీయాలు ప్రారంభమైయ్యాయి. కేంద్రం విధించిన లాక్ డౌన్ వల్ల తాము నష్టపోతున్నామని, లాక్‌డౌన్ విధించే ముందు రాష్ట్రాలతో చర్చించాల్సి ఉందని, కానీ కేంద్రం అలా చేయలేదని మమతా బెనార్జీ ప్రారంభంలోనే కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తరువాత రాష్ట్రాలతో చర్చించకుండా కేంద్ర బృందాలను పంపటంపై కూడా మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కేంద్ర బృందాలను రానివ్వమని పేర్కొన్నారు. అయితే కేంద్రం కూడా మంకుపట్టుతో బృందాలను పంపించింది.
బెంగాల్ దాదాపు నాలుగు దేశాలకు సరిహద్దు రాష్ట్రం. అయితే ఆయా దేశాల నుంచి రవాణాను కేంద్రం అనుమతించింది. దీంతో మళ్లీ మమతా కేంద్రంపై చిర్రుమంది. కేంద్ర తీరువల్లనే కరోనా విజృంభిస్తుందని విమర్శలు చేశారు. తాము ఇతర దేశాల నుంచి రవాణాను సాగనియ్యమని, తమ రాష్ట్రానికి కరోనా ముప్పు వస్తుందని మమతా పేర్కొన్నారు. దీంతో కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా మమతా సర్కార్‌కు లేఖ రాశారు. అనుమతించాల్సిందేనని ఆదేశించారు. ఇలా ప్రతిసారి కేంద్రానికి, మమతా బెనర్జీకి తగాదాలే నడుస్తున్నాయి. రాష్ట్రంలో బిజెపి నేతలు కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు.
తొలినుంచి కేంద్రం నియమించిన గవర్నర్ కూడా ఇదే తరహాలోనే మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆయన ఒక రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని బెంగాల్‌లో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ గేటు వద్ద ఆందోళన చేయడం, ఆహ్వానించకుండానే సచివాలయానికి వెళ్లడం వంటివి గవర్నర్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వంపై కక్ష కట్టిందని గ్రహించిన మమతా కూడా అదే తరహాలో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపైనే దృష్టి పెట్టి రెండు పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా “జన్ సంవాద్ ర్యాలీ” పేరుతో ఢిల్లీ బిజెపి కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. బిజెపి దీన్ని వర్చువల్ ర్యాలీ అంటోంది. షా ప్రసంగాన్ని వేలాది మంది బిజెపి కార్యకర్తలు ప్రత్యక్షంగా చూశారు.
ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఘాటు విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో మమత రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలన్నారు. గణాంకాలు చెప్పేటప్పుడు పొరపాటున బాంబులు, హత్యలు, అల్లర్ల సంఖ్యను, చనిపోయిన బిజెపి కార్యకర్తల సంఖ్యను చెప్పకుండా చూసుకోండంటూ షా సెటైర్ వేశారు.
2014 నుంచి పశ్చిమ బెంగాల్‌లో వందకు పైగా బిజెపి కార్యకర్తలు హత్యకు గురయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంటే పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రాజకీయ హింస కొనసాగుతోందని అమిత్ షా ఆరోపించారు.
త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మమత సారధ్యంలోని తృణమూల్‌ను ఓడించి బిజెపికి పట్టం కడతారని ఆయన చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌ను ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కూడా అమలు చేస్తున్నారని, బెంగాల్‌లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
పేదలకు ఉచిత వైద్యం ఎందుకు అందనీయడం లేదని అమిత్ షా ప్రశ్నించారు. మమత కేంద్ర పథకాలను పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయనీయడం లేదని ఆరోపించిన ఆయన పేదలపై, పేదల పథకాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని అమిత్ షా సూచించారు.
కరోనా వేళ వలస కార్మికులను తరలించేందుకు శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేస్తే కరోనా ఎక్స్‌ప్రెస్‌లంటూ మమత ఎగతాలి చేశారని, త్వరలో జరిగే ఎన్నికల్లో తృణమూల్ పార్టీని అదే రైళ్లలో కార్మికులు బయటకు తరలిస్తారని అమిత్ షా చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను వ్యతిరేకించి మమత బెనర్జీ పెద్ద తప్పు చేశారని, దాని ఫలితం ఆమె చవిచూడబోతున్నారని ఆయన చెప్పారు. బెంగాల్ శరణార్ధులకు భారత పౌరసత్వం ఇస్తే మమత ఎందుకు వ్యతిరేకించారని షా ప్రశ్నించారు.
కమ్యూనిస్టులకు, తృణమూల్‌కు అవకాశమిచ్చిన బెంగాల్ వాసులు ఒకసారి బిజెపికి అవకాశమివ్వాలని షా కోరారు. బిజెపి ఐదేళ్ల పాలనతో బెంగాల్‌లో అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగిత, ఉగ్రవాదం, హింస అక్రమ చొరబాట్లకు అవకాశం లేకుండా చేస్తామన్నారు.
అయితే అమిత్ షా ప్రచారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలాంటి రాజకీయ ప్రచారాలు చేయడం అన్యాయమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా సమయంలో రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించాయి.
ఇటీవలి బీహార్ లో కూడా ఇలాంటి ప్రచారమే చేశారు. అక్కడ కూడా ఇలాంటి విమర్శలే అమిత్ షాకు ఎదురయ్యాయి. ప్రతిపక్షాలు ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు.
అమిత్ షాపై మండిపడ్డ మమతా బెనర్జీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్ లో అవినీతి పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ విమర్శలు గుప్పించిన అమిత్ షాపై దీదీ ఘాటుగా స్పందించారు.
మన దేశంలోని సమ్మిళిత భావనను ప్రమాదంలోకి నెట్టివేసిన వ్యక్తి, బెంగాల్ సంస్కృతి పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నారు అంటూ అమిత్ షాను విమర్శించారు. అమిత్ షా కళ్ల ముందే అతని వ్యక్తులు విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని… దాన్ని పునఃప్రతిష్టించింది మమతా బెనర్జీ అనే విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు.
అంతేకాదు ”అమిత్ షాను తిరస్కరించిన పశ్చిమ బెంగాల్” అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు. మమతా బెనర్జీ పై అమిత్ షా విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనపై మమత ఘాటుగా స్పందించారు.