iDreamPost
android-app
ios-app

Kerala, Leaders Murder, Alappuzha – ఇరువురు నేతల హత్యలతో అట్టుడికి పోతున్న అలప్పుజ

Kerala, Leaders Murder, Alappuzha – ఇరువురు నేతల హత్యలతో అట్టుడికి పోతున్న అలప్పుజ

కేరళలోని అలప్పుజ జిల్లా రాజకీయ హత్యలతో అట్టుడికిపోతోంది. గంటల వ్యవధిలోనే వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు దారుణ హత్యకు గురవడం సంచలనం సృష్టిస్తోంది. శనివారం రాత్రి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ హత్యకు గురయ్యారు. ఆయన మరణించిన 12 గంటల వ్యవధిలోనే బీజేపీ కీలక నేతను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.

శనివారం రాత్రి ఎస్‌డీపీఐ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా హత్య కావించబడ్డారు.బైక్‌పై వెళ్తున్న షాన్‌ను​ కారులో ఫాలో అయిన దుండగులు వెనక నుంచి ఢీకొట్టారు. బైక్‌పై నుంచి కింద పడిపోయిన ఆయనని కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనకు స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి,కోచిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కేఎస్ షాన్ మృతి చెందారు.దీని వెనక ఆర్ఎస్ఎస్ హస్తముందని ఎస్‌డీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేఎస్ షాన్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే బీజేపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆదివారం ఉదయం కేరళ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్‌ ఇంట్లోకి కొందరు దుండగులు చొరబడి హత్య చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడైన శ్రీనివాస్‌ వృత్తిరీత్యా న్యాయవాది. కాగా తమ పార్టీ నేతను ఇస్లామిక్‌ స్టేట్‌ టెర్రరిస్టుల గ్రూప్‌ హత్య చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇదిలా ఉంటే కేఎస్ షాన్ మరణించిన కొన్ని గంటలకే బీజేపీ నేత హత్య జరగడంతో ఆయన హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందా..? లేక మరేదైనా కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఇద్దరు రాజకీయ నేతల హత్యతో అలప్పుజ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తమ నేతల హత్యలతో ఇరు పార్టీల నేతలు,కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు హింసాత్మక ఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా 144 సెక్షన్‌ను అమలు చేసి ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు.

ఇక నేతల హత్యలను కేరళ సీఎం పినరయి విజయన్​ తీవ్రంగా ఖండించారు.నిందితులను త్వరగా పట్టుకుని వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.రాజకీయాలలో హత్యలను ప్రోత్సహించకూడదని అన్ని పార్టీలకు సీఎం పినరయి విజ్ఞప్తి చేశారు.సమాజంలో విద్వేషాలు సృష్టించడానికి ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిని ఒంటరి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలను కేరళ సీఎం విజయన్‌ కోరారు.

Also Read : ఎన్నికల రహదారులు..! గట్టెక్కించేనా…?