సగం బడ్జెట్ ! ఆచరణ దూరంలో పార్టీల హామీలు.

జీహెచ్ఎంసీ పీఠాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఉత్సాహంలో రాజకీయ పార్టీలు చేస్తున్న హామీలు శృతిమించుతున్నాయి. వాస్తవ పరిస్థితిపై అంచనా లేదో.. లేక ఎలాగైనా ఓటు బ్యాంకును రాబట్టాలనుకుంటున్నారో కానీ ప్రధాన పార్టీలు సైతం ప్రజలకు అసాధ్యమైన హామీలను ఇస్తున్నాయి. బల్దియా పీఠాన్ని ఎవరూ దక్కించుకోనున్నారో మూడు రోజుల్లోనే బ్యాలెట్ బాక్స్‌లు తెలుసుకోనున్నాయి. ఈ సందర్భంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చిన ‘ వరద సాయం ’ పంపిణీ ఎవరితో సాధ్యమవుతుందో ఒకసారి పరిశీలిద్దాం…

గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేస్తున్న వరద సాయం హామీ నేల విడిచి సాము చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీ జీహెచ్ఎంసీ సగం బడ్జెట్‌ను కేటాయించడం గమనార్హం.. ఓటర్లను ఎలాగైనా ఆకట్టుకోవడంలో కష్టసాధ్యమైన హామీలను గుప్పిస్తున్నారు. మొత్తం బడ్జెట్‌లో సగం వరద సాయానికే అందిస్తే పాలన కుంటుపడుతుంది. భవిష్యత్‌లో కొత్త ప్రాజెక్టుల సంగతేమో.. జీతాలకు కూడా అవస్థలు పడక తప్పదు. ఇలా సాధారణ అంచనా కూడా లేకుండా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వాగ్ధానాలను మేనిఫెస్టోలో కూడా చేర్చాయి. వరద సాయం పంపిణీ కోసం టీఆర్ఎస్ ఇప్పటికే సుమారు ఏడొందల కోట్లను ఖర్చు చేసింది. వరద సాయాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి కొందరు లేఖలు రాసిన నేపథ్యంలో పంపిణీని తాత్కలికంగా నిలిపివేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిస్తామని కేటీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్‌ మీద పైచేయి సాధించడానికి కాంగ్రెస్, బీజేపీలు భారీ స్థాయిలో వరద సాయం అందజేస్తామని మేనిఫెస్టోలో కూడా చేర్చాయి.

నగరంలో నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణ సాయంగా ఇంటికి రూ.10 వేల చొప్పున అందిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రూ.550 కోట్లను విడుదల చేసింది కూడా… అయితే బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఎంత మందికైనా సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలోనే ఎన్నికల నోటిపికేషన్ విడుదలయింది. అయినా సాయం అందజేత కొనసాగాలని భావించి మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత ఎన్నికల సంఘం వీటిని కూడా నిలిపివేయాలని సూచించడంతో కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టీఆర్ఎస్ ముందుగా ప్రకటించిన మేరకు రూ.10 వేలు అందజేస్తామని చెబుతుండగా.. బీజేపీ రూ.25 వేలు, కాంగ్రెస్ రూ.50 వేల చొప్పున ఇస్తామని హామీలు గుప్పిస్తున్నాయి.

వరద సాయం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.550 కోట్లలో మొదటి విడతలో నేరుగా లబ్దిదారులకు రూ.525 కోట్లను అందజేసింది. ఆ తర్వాత కూడా మీసేవా కేంద్రాల వద్ద క్యూలైన్లు కనిపించాయి. దరఖాస్తు అందిన ఒక్క రోజులోనే సాయాన్ని బ్యాంకు ఖాతాల ద్వారా మరో రూ.వంద కోట్లు వేశారు. ఎన్నికల సంఘం నిర్ణయంతో దరఖాస్తుల స్వీకరణ ఆగిపోయింది. అయితే ఇప్పటికే సుమారు మూడు లక్షల దరఖాస్తులు మీసేవా కేంద్రాల ద్వారా అందినట్టు సమాచారం.. వీరికి కూడా ఎన్నికల తర్వాత సాయాన్ని అందిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. ఈ లెక్కన ఇంకో రూ.300 కోట్లు కేటాయిస్తే ఆ పార్టీ హామీని నిలబెట్టుకున్నట్టే…

ఇప్పటికే చెల్లింపులను పరిగణలోకి తీసుకున్నా కనీసం ఆరు లక్షల మంది బాధితులను పరిగణలోకి తీసుకున్నా.. బీజేపీ ఈ కార్యక్రమం కోసం రూ.1,500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హామీ ప్రకారం ఇంటికి రూ.50 వేలు ఇవ్వాలంటే రూ. మూడు వేల కోట్లు అవసరమవుతాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.5,600 కోట్ల అంచనాతో వేశారు. అంటే బడ్జెట్‌లో సగం నిధులు వరద సాయం కోసమే పంపిణీ చేయాల్సి ఉంటుంది. సగం బడ్జెట్ ఖర్చు చేస్తే.. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త ప్రాజెక్టులను ఎలా చేపడుతారో ఆయా పార్టీలకే తెలియాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మేయర్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం కష్టమే కావచ్చు.. తామిచ్చిన హామీలకు ఎంత నిధులు అవసరమవుతాయో, వాటిని ఎలా సర్దుబాటు చేస్తారనే అంశాలను కూడా ఆయా పార్టీలు ప్రస్తావించలేదు. అయితే వాస్తవ పరిస్థితుల్లో వారి హామీని అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్ గణంకాలు నిరూపిస్తున్నాయి. బల్దియా ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి…!

Show comments