Idream media
Idream media
తెలంగాణలో అసెంబ్లీ సమరానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ, పొలిటికల్ హీట్ చూస్తుంటే.. త్వరలోనే ఎన్నికలు అన్నంతగా కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. ఇలా ఏ పార్టీ తగ్గడం లేదు. ఎవరి స్థాయిలో వారు రాజకీయ వేడి రాజేస్తున్నారు. మాటలతో మంటలు రేపుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు. పోలీసుల అనుమతి రాలేదంటూనే.. షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర ప్రారంభించడానికి భారీ స్థాయిలో పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశాయి. మరోవైపు టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మధ్యలో రంగంలోకి కేటీఆర్ కూడా దిగారు. మల్లారెడ్డికి ఒత్తాసు పలుకుతూ.. టీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఒక్కో పార్టీ, ఒక్కో టాపిక్ ను ఎన్నుకుని దాని చుట్టూ రాజకీయాలు చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ ఇప్పటి నుంచే మహా సంగ్రామానికి సై అంటోంది. దీన్ని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ కూడా సిద్ధమైంది.బండి సంజయ్ యాత్ర దేనికోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలంటూ తాజాగా కేటీఆర్ డిమాండ్ చేశారు. వరదలు వచ్చిన సమయంలో మిగతా రాష్ట్రాలకు నిధులు ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మొండి చేయి చూపించిందంటూ ఆ పార్టీ తప్పులను ఎత్తి చూపుతున్నారు. రాష్ట్రాన్ని అదుకోలేని నాయకులు సిగ్గు లేకుండా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేస్తూ కాక రేపారు.
ఇక కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కూడా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అధికార పార్టీతో సై అంటే సై అంటున్నారు. ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేయమంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ బలం ఏంటో చూపిస్తా అంటూ సవాల్ విసురుతున్నారు. మంత్రి మల్లారెడ్డితో పాటు కేసీఆర్, కేటీఆర్ లపై కూడా విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. సవాళ్లు.. ప్రత్యర్థులపై విమర్శల ద్వారా పార్టీలో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పిచ్చి కుక్కలుగా, ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు చిల్లర వేషాలు వేస్తున్నారు. తిట్ల పోటీ పెట్టుకుందామంటే మేం రెడీ. ప్రగతి భవన్‌కు లేదా ఫాంహౌస్‌కు రమ్మన్నా వస్తా. మల్లారెడ్డి అవినీతిని కేటీఆర్, కేసీఆర్ సమర్థిస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇలా ఎవరికి వారు మాటల దాడిలో వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా తెలంగాణలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. అంతేకాదు.. తిట్ల పోటీ పెట్టుకుందామా అంటూ కూడా సవాళ్లు విసురుకుంటుండడం చర్చనీయాంశంగా మారుతోంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు పొలిటికల్ యుద్ధం మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.