iDreamPost
android-app
ios-app

హుజూరాబాద్ లో పొలిటిక‌ల్ హంగామా

హుజూరాబాద్ లో పొలిటిక‌ల్ హంగామా

ఈట‌ల రాజేంద‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు జోరుగా సాగుతున్నాయి. ప్ర‌భుత్వం మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ప్ప‌టి నుంచీ వ్య‌క్తిగ‌తంగా త‌న బ‌లం పెంచుకునేందుకు ఈట‌ల‌ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తుంటే, అత‌ని సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎదురుగాలి వీచేలా టీఆర్ఎస్ శ్రేణులు పావులు క‌దుపుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ మంది ఈట‌ల‌కు సంఘీభావం ప్ర‌క‌టించిన వారే. కానీ, కొద్ది రోజులుగా అక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థితులు మారుతున్నాయి. ఈట‌ల వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నిస్తున్న‌ టీఆర్ఎస్ అధిష్ఠానం హుజురాబాద్ లో పై చేయి సాధించేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. న‌యానో, భ‌యానో ఈట‌ల మ‌ద్ద‌తుదారుల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు పావులు క‌దుపుతోంది.

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్న ఈట‌ల రాజేంద‌ర్.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి హుజూరాబాద్ వేదిక‌గా త‌న స‌త్తా చాటేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. ఇప్ప‌టికే స్థానిక నేత‌లంద‌రితోనూ స‌మావేశ‌మైన ఈట‌ల త‌న మ‌న‌సులోని మాట‌ను వారికి వ్య‌క్త‌బ‌రుస్తూ సానుభూతి ప‌వ‌నాలు వీచేలా మంత్రాంగాలు చేశారు. దీంతో ఈట‌ల‌కు రోజురోజుకూ మద్ద‌తు పెర‌గ‌సాగింది. ఇదంతా గ‌మ‌నిస్తున్న టీఆర్ఎస్ అధిష్ఠానం హుజూరాబాద్ లోనే ఈట‌ల రాజ‌కీయాల‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి ఫోకస్ మొత్తం హుజూరాబాద్ మీదనే పెట్టినట్టు కనిపిస్తోంది. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని నేత‌ల‌తో నిత్యం స‌మావేశం అవుతున్నారు. ఈటలకు ధీటుగా మ‌రో నాయ‌కుడిని తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

నియోజకవర్గంలో దాదాపు తొంభై శాతం మంది ప్రజాప్రతినిధులు ఈటలకు సంఘీభావం ప్రకటించారు. పలువురు ఉద్యమకారులు ఇతర పార్టీల నేతలు ఈటలతో టచ్ లోకి వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈటల సొంత పార్టీ పెట్టడం ఖాయం అనే ప్రచారం మరింత బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేగంగా పావులు కదుపుతున్న అధిష్టానం.. ఈటలను సొంత నియోజకవర్గంలో బలహీన పర్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు తాజా స‌మీక‌ర‌ణాలే నిద‌ర్శ‌నం.

హుజూరాబాద్ లో తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈట‌ల రాజేందర్ కు వ్య‌తిరేక స్వ‌రాలు వినిపిస్తున్నాయి. దీంతో నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాలు ఒక్కసారిగా మారుతున్నాయి. పలువురు ప్రజా ప్రతినిధులు ఈట‌ల‌ను వ్య‌తిరేకిస్తూ తీర్మానం చేశారు. హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రమ పలువురు కౌన్సిల‌ర్లు ఈటల కు వ్యతిరేకంగా తీర్మానం చేసారు. తామంతా టీఆర్ఎస్ బీ ఫార్మ్ తోనే గెలిచామని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటామని, గులాబీ పార్టీలోనే కొనసాగుతామని తెలిపారు. సీఎం కేసీఆరే త‌మ నాయ‌కుడ‌ని అన్నారు. ఈట‌ల వెంట ఎవ‌రూ ఉండ‌మ‌ని, కేసీఆర్ వెంటే ఉంటామని కౌన్సిలర్లు వెల్ల‌డించారు. దీంతో స్థానిక రాజ‌కీయాలు వేడెక్కాయి. త్వ‌ర‌లోనే ఈట‌ల త‌న నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుల‌తో మ‌రోమారు స‌మావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది.