Idream media
Idream media
‘‘ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావులో త్వరలో మునుపటి ఉద్యమ నేతను చూస్తాం”.. అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రెండు రోజుల క్రితం మాట్లాడిన కేసీఆర్ కూడా ‘‘పోరాటాలకు మేం భయపడేది లేదు. ప్రజల కోసం నిలబడి ఎక్కడికక్కడ కేంద్రాన్ని ప్రశ్నిస్తం. త్వరలో ఉద్యమానికి శ్రీకారం చూడతామ్ ” అని పేర్కొన్నారు. ఇవన్నీ పరిశీలిస్తే తెలంగాణ సీఎం కేంద్రంపై సమరానికి సిద్ధమవుతున్నారని స్పష్టం అవుతోంది. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు అనంతరం తెలంగాణలో ఆ పార్టీ విస్తరణకు చాన్స్ ఇవ్వకుండా కేసీఆర్ పక్కా వ్యూహాలు పన్నుతున్నారని తెలుస్తోంది. మరో రెండేళ్లలో ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉన్న తరుణంలో మూడో సారి కూడా గులాబీ జెండా ఎగురవేయాలంటే మునుపటిలా నిశ్శబ్ధ విప్లవం పనిచేసేలా లేదని, బీజేపీ మాటకు మాట చెల్లిస్తేనే నెగ్గుకురాగలమని కేసీఆర్ గుర్తించినట్లుగా ఉంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ప్రధానంగా రెండు సందర్బాల్లోనూ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన ఇలా భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ కార్యాలయ భవనం శంకుస్థాపనకు వెళ్లిన కేసీఆర్ ఏకంగా ఢిల్లీలో తొమ్మిది రోజుల పాటు ఉన్నారు. అప్పుడు కూడా కేంద్రంలోని ప్రముఖులు అందరితోనూ సమావేశం అయ్యారు. మళ్లీ కొద్ది రోజులకే ఢిల్లీ వెళ్లారు. ఇలా వరుసగా ఆయన కేంద్రంలోని పెద్దలను కలుస్తున్న నేపథ్యంలో గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేంద్రంపై విమర్శలు చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. హుజురాబాద్ లో గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా గులాబీ వికసించలేకపోయింది. ఈటల రాజేందర్ గెలుపును అడ్డుకోలేకపోయింది. అక్కడ గెలుపుతో బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణలో పాగా వేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫాం హౌస్ ను కూలగొడతామంటూ ప్రకటనలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. ఏకంగా కేంద్రంతోనే ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో రైతులు పండించిన వడ్లన్నీ కేంద్రమే కొనాలనే డిమాండ్ తో ఈ నెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా చేస్తామని ప్రకటించారు. ‘‘శుక్రవారం రైతులతో కలిసి భారీ ఎత్తున ఆందోళనలు చేస్తం. పోరాటాలకు మేం భయపడేది లేదు. ప్రజల కోసం నిలబడి ఎక్కడికక్కడ కేంద్రాన్ని ప్రశ్నిస్తం” అన్నారు. రాష్ట్ర రైతుల కోసం తమతో కలిసి ధర్నాలో పాల్గొంటారా అని బీజేపీ రాష్ట్ర నాయకులకు సవాల్ విసిరారు. గొర్రెల పంపిణీ పథకంలో కేంద్రం వాటా ఉన్నట్టు చూపిస్తే రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాలు విసిరారు. వడ్లు కొనేవరకూ కేంద్రాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.పెట్రోల్ ధరల విషయంలో తామే కేంద్రంతో పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు తోడు తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ త్వరలో సీఎం కేసీఆర్‌లో ఉద్యమ నేతగా మారనున్నారని పేర్కొనడం చూస్తుంటే.. పక్కా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో మళ్లీ ఉద్యమిద్దామని, కేంద్ర ప్రభుత్వాన్ని తరిమి కొడదామని కేటీఆర్ పిలుపు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏడేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ అసలు రూపం చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ పరిశీలిస్తే.. కేసీఆర్ పై ఇటీవల వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడంతో పాటు, రానున్న ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు గులాబీ బాస్ కంకణం కట్టుకున్నారని స్పష్టమవుతోంది. అలాగే ఇకపై రోజూ మీడియా ముందుకు వస్తా అంటూ ప్రకటనలు ఇవ్వడం కూడా ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. మరి ఉద్యమం ఎలా ఉండబోతుందో చూడాలి.