iDreamPost
iDreamPost
డొనాల్డ్ ట్రంప్. కేవలం నాలుగేళ్లు మాత్రమే అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగారు. కానీ నాలుగు దశాబ్దాలకు పైగా గుర్తుండిపోయే నాయకుడిగా మారారు. నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష పదవికి ఆయన అనూహ్య రీతిలోఎన్నికయ్యారు. ఆనాటి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ని ఎదుర్కొన్న ట్రంప్ విజయం కూడా సంచలనమే. ఆ తర్వాత నాలుగేళ్ల పాలనలో అడుగడుగునా సంచలనాలే. ఆయన విధానాల కన్నా మాటలు, చేతలు, మీడియాలో వ్యవహారాలే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ప్రపంచమంతా ఆయన పేరు మారుమ్రోగేందుకు దోహదపడ్డాయి. వాస్తవానికి ఆయన ఎన్నికల్లో గెలిచిన నాడే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు తీరా తన ఓటమిని ఆయన అంగీకరించనని ప్రకటించే స్థాయికి చేరింది.
అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా ప్రపంచ ఆధిపత్యం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. తమ పెత్తనాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తారు. ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాత అధ్యక్ష పీఠం ఎక్కిన నేతల తీరులో ఇది స్పష్టంగా గోచరిస్తుంది. తాము కేవలం వైట్ హౌస్ కి మాత్రమే బాస్ అని మరచిపోయి విశ్వానికే తాము హెడ్ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. కానీ అదంతా అంతర్గత వ్యవహారంగా ఉంటుంది. ట్రంప్ మాత్రం అందరికీ భిన్నంగా వ్యవహరించారు. తాను అనుకోవడమే కాదు.. తాను అనుకున్నట్టు, ఆశించినట్టు ప్రపంచమంతా భావించాలని ఆయన కోరుకున్నారు. అందుకు అనుగుణంగా మాటల్లో, చేతల్లో చూపించారు. ఉత్తర కొరియా కిమ్ తో కలహం నుంచి తాజాగా చైనాతో గిల్లికజ్జాల వరకూ అన్నింటా ట్రంప్ మాటల దూకుడు చూపించారు. చేతల కన్నా ప్రచారంతో ప్రత్యర్థులను కట్టడి చేయాలని చూశారు. వాటి ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అమెరికా ప్రజల్లోని ఓ వర్గం ప్రజలను సంతృప్తి పరిచేందుకు ప్రాధాన్యతనిచ్చారు.
అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మితవాద నేతలకు జనం పట్టం గడుతున్న సమయంలో అమెరికా పీఠం కైవసం చేసుకున్న ట్రంప్ అలాంటి నేతలందరితో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేశారు. ఆక్రమంలోనే మోడీతో సన్నిహితంగా మెలిగారు. బ్రెజిల్, ఇండియా,, యూఎస్ అధ్యక్షుల మధ్య స్నేహం లోకమంతా విదితమే. దాని ప్రభావంతో చివరకు మోడీ నేరుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి దోహదం చేసింది. హౌడీ మోడీ అంటూ ఏడాది క్రితం అమెరికాలో ట్రంప్ ని కీర్తించేందుకు ప్రయత్నం చేసిన మోడీ, ఆతర్వాత నమస్తే ట్రంప్ అంటూ అహ్మదాబాద్ లో భారీ హంగామా చేశారు. కోవిడ్ భయం వెంటాడుతున్నా విస్మరించి ఎన్ ఆర్ ఐ లను ఆకర్షించడమే లక్ష్యంగా సాగారు. చివరకు మోడీ ప్రయత్నాలు కూడా ఫలించలేదనడానికి ఎన్ ఆర్ ఐలలో అత్యధికులు బైడెన్ కి జై కొట్టడమే సంకేతం.
వాస్తవానికి మోడీ, ట్రంప్ మధ్య స్నేహానికి మరో కారణం కూడా ఉంది. 2002లో మోడీ గుజరాత్ సీఎం పీఠం ఎక్కగానే జరిగిన మారణహోమం పట్ల ప్రపంచమంతా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ క్రమంలోనే మోడీని అమెరికా లో కాలుపెట్టకుండా వీసా పై ఆంక్షలు పెట్టారు. ఆ తర్వాత మోడీ వీసా మీద ఆంక్షలు తొలగించడానికి చేసిన వివిధ ప్రయత్నాలు వైస్ ప్రెసిడెంట్ హోదాలో జో బైడెన్ పలుమార్లు అడ్డుకున్నారు. ససేమీరా అన్నారు. చివరకు ఇటీవల కశ్మీర్ విషయంలో, సీఏఏ చట్టాల తీసుకురావడంలో మోడీ సర్కారు తీరుని బైడెన్ తప్పుబట్టారు. ఇలా బైడెన్, మోడీ మధ్య సుదీర్ఘకాల విరోధం కూడా ఉండడంతో అనివార్యంగా శత్రువుకి శత్రువు మిత్రుడిగా మారినట్టు చెప్పవచ్చు. ఇక జాతి, దేశభక్తి వంటి అనేక అంశాలలో సన్నిహిత భావనలు కలిగిన ట్రంప్, మోడీ చేతులు కలపడం పెద్ద విశేషం కాదు. కానీ ఇప్పుడు మోడీ ప్రచారం చేసినా ఇండో అమెరికన్లు భిన్నంగా ఆలోచించారు. ట్రంప్ ని సాగనంపారు. కరోనా విషయంలో ట్రంప్ మొండి వైఖరి పట్ల అమెరికన్లకే విసుగొచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఆశించిన దానికన్నా ఘోర ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం ప్రపచంలోని పలు దేశాల్లో ట్రంప్ ఓటమి, బైడెన్ రాకతో ఒనగూరేదేమీ లేకపోయినా ట్రంప్ లాంటి వాచలత్వం ఉన్న అమెరికా అద్యక్షుడి ఓటమిని ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తోంది. అనేక దేశాల్లో కూడా ఈ ఎన్నికల ఫలితాల పట్ల ఆసక్తి పెరగేందుకు ట్రంప్ ధోరణి ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. అదే సమయంలో మనదేశంలో మోడీ , ఆయన అనుచరులు చివరి వరకూ ఆశించినట్టు ట్రంప్ కి రెండోసారి అధికారం దక్కకపోవడం కీలక పరిణామాలకు కారణం కాబోతోంది. ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి మార్పులున్నప్పటికీ ఇండో-అమెరికా అధినేతల మధ్య సంబంధాల్లో మార్పు స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. అయితే అమెరికాలో ట్రంప్ కారణంగా ఏర్పడిన పోలరైజేషన్ ప్రభావం మాత్రం ఆ దేశాన్ని మరికొంత కాలం వెంటాడే అవకాశం ఉంటుంది. డెమెక్రాట్లలో మితవాదిగా పేరున్న బైడెన్ కారణంగా అది ఏమేరకు చల్లారుతుందన్న దానిని బట్టి అమెరికన్ల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.