రాజకీయ గ‌లీజ్ మాట‌లు

ఆయనొక కమ్యూనిస్ట్ నాయకుడు,విద్యార్థి రాజకీయాలతో మొదలు పెట్టి గత మూడు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాడు… మంచి మనిషన్న పేరుంది కానీ బాస్టడ్స్ అని ప్రభుత్వాన్ని లైవ్ డిబేట్ లో తిట్టాడు…ఆ నాయకుడు సిపిఐ లక్ష్మినారాయణ .

ఆయ‌నో ఎంపీ. పేరు ధ‌ర్మ‌పురి అర‌వింద్‌. మాట అదుపులో ఉండ‌దు. అస‌ద్ గ‌డ్డం కోసి కేసీఆర్‌కు అతికిస్తాడ‌ట‌. అస‌ద్‌ని క్రేన్‌కి వేలాడ‌దీస్తాడ‌ట‌. బాధ్య‌త గ‌ల ప‌ద‌వుల్లో ఉంటూ ఇట్లా మాట్లాడటం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌.

స్పీక‌ర్ త‌మ్మినేని స్పాట్‌లో కొడ‌తా, స‌హ‌నం కోల్పోతే ఎవ‌రినీ కొడ‌తానో త‌న‌కే తెలియ‌దంటాడు. ఇంకొకాయ‌న రోడ్లు హేమ‌మాలిని బుగ్గ‌ల్లా ఉన్నాయంటాడు. ఉల్లి ధ‌ర‌లు పెరిగాయ‌ని అంటే త‌న‌కి ఉల్లి తినే అల‌వాటు లేద‌ని ఒక కేంద్ర‌మంత్రి అంటారు.

సావ‌ర్క‌ర్‌కి ,గాడ్సేకి శారీరక సంబంధం ఉంద‌ని కాంగ్రెస్ బుక్‌లెట్ రిలీజ్ చేసింది. అస‌లు రాహుల్‌గాంధీనే ఆ టైప్ అని బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది.

ప్ర‌జాస్వామ్యంలో మాట్లాడే హ‌క్కు ఉంద‌న్నారు కానీ, నోటికొచ్చింది మాట్లాడే హ‌క్కు ఉంద‌న‌లేదు.

వాజ్‌పేయ్ కాలంలో బీజేపీకి మంచి పేరు ఉండేది. నాయ‌కులు జాగ్ర‌త్త‌గా మాట్లాడేవారు. మోదీ హ‌యాంలో ఆ పార్టీ దిగ‌జారిపోయింది. అధికారం కోసం ఏం చేసినా త‌ప్పు లేద‌నే ధోర‌ణిలోకి దిగింది. ముస్లింల‌ను రెచ్చ‌గొట్ట‌డం, హిందుత్వాన్ని దువ్వ‌డం ప‌నిగా పెట్టుకుంది.

దేశ ద్రోహుల్ని ఏరివేస్తామ‌ని బీజేపీ నాయ‌కులు సునీల్‌దేవ్‌ద‌ర్ రంకెలు వేస్తున్నారు. అస‌లు దేశ ద్రోహులంటే ఎవ‌రు?
ద్రోహం చేశార‌ని ఎలా నిరూపిస్తారు? బీజేపీలో ఉంటే దేశ‌భ‌క్తి, ప్ర‌తిప‌క్షంలో ఉంటే దేశ ద్రోహ‌మా?

ఇంకొకాయ‌న 72 ర‌కాల తెగ‌ల ముస్లింలు మ‌న‌దేశంలో ఉన్నారని అంటాడు. ఈ తెగ‌ల మీద ఎప్పుడు స‌ర్వే జ‌రిగింది? ఎందుకు జ‌రిగింది? అధికారంలో ఉన్న పార్టీ నాయ‌కులు ఈ ర‌కంగా మాట్లాడితే పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ మొద‌లైన బిల్లుల‌పైన ప్ర‌జ‌ల్లో అనుమానాలు రాకుండా ఉంటాయా?

Show comments