Venkateswarlu
Venkateswarlu
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత.. మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా కొంతమంది మగాళ్లు.. ఆడవాళ్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా పరిచయం చేసుకుని, వారితో చనువుగా ఉండి.. తర్వాత పాడు బుద్ధి చూపిస్తున్నారు. తాజాగా, ఓ అమ్మాయిపై వేధింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాప్ చేసి మరీ అమ్మాయిని ఇబ్బందిపెడుతున్న అతడి ఆట కట్టించారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లాలోని మేమవరం గ్రామానికి చెందిన లంకా రాజేష్ చెడువ్యసనాలకు బానిసయ్యాడు. ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఓ పాడు ప్లాన్ వేశాడు. షేర్‌చాట్‌లో అమ్మాయిలకు మెసేజ్‌లు పంపి వారిని ట్రాప్ చేస్తున్నాడు.
కొద్ది నెలల క్రితం సింగరాయకొండకు చెందిన ఒక యువతితో సదరు సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. తరుచుగా ఆ యువతిని కలుస్తూ ఆమెతో ఫొటోలు దిగాడు. అనంతరం వాటిని ఆమె బంధువులకు పంపుతానని.. సోషల్‌మీడియోలో షేర్ చేస్తానని బెదిరించి డబ్బులు వసూలు చేయసాగాడు. ఈనెల 5న ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లాడు. ఆమె గొంతుపై కత్తిపెట్టి బెదిరించి రూ.20వేలు లాక్కుని పారిపోయాడు. అంతటితో అతడి వేధింపులు ఆగలేదు.
యువతికి పదేపదే ఫోన్‌చేసి డబ్బులు పంపించాలని బెదిరించసాగాడు. అతడి బెదిరింపులతో విసిగిపోయిన యువతి డబ్బులు పంపటం ఆపేసింది. దీంతో ఈ నెల 11న ఆ యువతితో దిగిన కొన్ని ఫొటోలను కుటుంబసభ్యులకు పంపాడు. దీంతో బాధిత యువతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీ సాయంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వాడే అమ్మాయిలు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.