అమెరికాలో మళ్ళీ వెల్లువెత్తిన నిరసనలు
ఇప్పటికే జార్జ్ ఫ్లాయిడ్ జాత్యహంకార హత్యకు నిరసనగా అమెరికా భగ్గుమంది.మృతి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ కి మద్దతుగా”ఐ కాంట్ బ్రీత్” అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా అలాంటి మరో ఘటన కారణంగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి.
వివరాల్లోకి వెళితే అట్లాంటాలో రేషర్డ్ బ్రూక్స్ (27) అనే మరో ఆఫ్రో అమెరికన్‌ను పోలీసులు కాల్చిచంపడంతో మరోసారి అమెరికాలో ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసులు అమానుషంగా రేషర్డ్‌ను బలిగొన్నారన్న ఆగ్రహావేశాలతో అట్లాంటాలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. వెండీస్ రెస్టారెంట్‌కు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. రెస్టారెంట్‌కు సమీపంలో ఉన్న అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అట్లాంటాలోని వెండీస్ డ్రైవ్ త్రూ రెస్టారెంట్ ముందు రేషర్డ్ బ్రూక్స్ తన కారును ఆపి కారులోనే నిద్రించాడు. కాగా వెండీస్ డ్రైవ్ రెస్టారెంట్ యజమాని పోలీసులకు రేషర్డ్ గురించి సమాచారం ఇచ్చాడు. తన రెస్టారెంట్ ముందు కారును నిలిపి కస్టమర్లకు ఇబ్బంది కలిగిస్తున్నాడని పోలీసులకు చెప్పడంతో పోలీసులు వెండీస్ డ్రైవ్ రెస్టారెంట్ దగ్గరకు చేరుకున్నారు. రేషర్డ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా మద్యం మత్తులో ఉండటం వల్ల ప్రతిఘటించాడు.
రేషర్డ్ ను అదుపులో తీసుకునే క్రమంలో అతనికి కరెంట్ షాక్ ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా పోలీసుల చేతిలో నుండి ఆ పరికరాన్ని(టేజర్) లాక్కుని రేషర్డ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. దాంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన రేషర్డ్ హాస్పిటల్లో చనిపోయాడు. దీంతో రేషర్డ్ ను కాల్చిన వీడియో క్లిప్పులు బయటకు రావడంతో నిరసనకారులు రెచ్చిపోయారు. వెండీస్ రెస్టారెంట్ కు నిప్పంటించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.
కాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ శనివారం అట్లాంటా పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఎరికా షీల్డ్స్ రాజీనామా చేయగా, రేషర్డ్‌ను కాల్చిన గార్రెట్ రోల్ఫె అనే పోలీసు అధికారిని ఆదివారం ఉద్యోగం నుంచి తొలగించారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన రేషర్డ్ బ్రూక్స్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రేషర్డ్ బ్రూక్స్ మృతికి నిరసనగా అతని కుటుంబం సభ్యులు కూడా నిరసనలో పాల్గొన్నారు.