Idream media
Idream media
వినూత్నమైన ఆలోచనలతో పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెడుతూ ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకే తీసుకెళుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. మరో సరికొత్త ఆలోచన చేస్తున్నారు. మహిళల రక్షణలో గ్రామ, వార్డు సచివాలయాలను భాగస్వాములను చేయాలని సంకల్పించారు. సచివాలయల్లో ఉన్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి సేవలను విస్తృతం చేయడం ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే వారికి పోలీసు హోదా కల్పించాలని, యూనిఫాం ఇవ్వాలని నిర్ణయించిన జగన్ సర్కార్.. మహిళల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
ప్రస్తుతం మహిళలు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే మండల కేంద్రాల్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నారు. మహిళలపై దాడి, గృహహింస లేదా ఇతర నేరాలు చోటు చేసుకున్నప్పుడు.. వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం అనేక సమస్యలతో కూడుకున్నది. స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేయాలంటే తగిన సమయంతోపాటు సహాయకులు కూడా అవసరం అవుతారు. ఈ లోపు గ్రామంలోని పెద్దలు ఆమెను పోలీస్ స్టేషన్ వరకూ రానీయకుండా.. పంచాయితీలు చేసి సమస్యను సద్ధుమణిగేలా చేస్తారు. ఈ ప్రక్రియలో బాధిత మహిళ భౌతికంగా, మానసికంగా నష్టపోతుంది. ఈ పరిస్థితిని మార్చేందుకు.. ఇకపై సచివాలయాల్లో ఉండే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శినే ఫిర్యాదులు స్వీకరించేలా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రెవెన్యూతో సహా అన్ని రకాల పౌర సేవలు గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా జగన్ ప్రభుత్వం అందిస్తోంది. ఇంతకు మునుపు మాదిరిగా ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఏపీలో తప్పింది. దేశంలో సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. పౌర సేవలే కాదు.. రిజిస్ట్రేషన్ సేవలు, ఆధార్ సేవలను కూడా సచివాలయాల్లో అందేలా జగన్ సర్కార్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాల్లోని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 500 సచివాలయాల్లో ఆధార్ సేవలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసు సేవలు కూడా గ్రామ స్థాయిలో అందించేందుకు జగన్ సర్కార్ ప్లాన్ చేస్తుండడం.. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక చర్యగా చెప్పవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే.. మహిళలకు కొండంత అండ దొరుకుతుంది. మహిళలపై నేరాలు తగ్గుముఖం పడతాయి.
Also Read : వైఎస్ ని తలపిస్తున్న జగన్ తీరు, విపక్షాలకు మింగుడుపడని వైఖరి