Krishna Kowshik
Krishna Kowshik
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే మేనిఫోస్టోను ప్రకటించింది అధికార బీఆర్ఎస్. మూడో సారి కూడా తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అటు కాంగ్రెస్, బీజెపీ కూడా ఈసారి గద్దెనెక్కబోయేది మేమేనంటూ చెప్పుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఓటర్లను మభ్య పెట్టేందుకు మద్యం, డబ్బు .. వివిధ రాష్ట్రాల నుండి తరలి వస్తున్నాయన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది పోలీసు శాఖ. సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద ఎక్కడిక్కడ వాహనాలు నిలిపివేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అక్రమంగా కారులో తరలిస్తున్న 27.540 గ్రాముల బంగారాన్ని మియాపూర్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
27 కేజీల బంగారంతో పాటు 15 కిలోల వెండిని గుర్తించారు. ఈ ఆభరణాలకు సంబంధించిన బిల్లులు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు మరో హవాలా డబ్బు బయటపడింది. కవాడీ గూడా ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 2.9 కోట్ల హవాలా డబ్బును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీ నగర్ పోలీసులు సీజ్ చేశారు. డబ్బులను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ లో రూ. 32 లక్షల 9వేల, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 10 లక్షల 39 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.