Idream media
Idream media
ఏపీలో తన పార్టీని నిలబెట్టుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేయని ఎత్తులంటూ లేవు. చేయని రాజకీయాలు లేవు. పార్టీ సిద్ధాంతాలను, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ లక్ష్యాలను సైతం పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయాలు కొంత మంది నేతలను, కేడర్ ను కూడా దూరం చేశాయి. కానీ, ప్రజల అభిమానాన్ని మాత్రం పొందలేక పోతున్నారు. ఎన్నో సార్లు హైడ్రామాలు కూడా మొదలుపెట్టారు. గత నెల ఒకటో తేదీన తిరుపతి ఎయిర్పోర్టులో జరిగిన ఘటన తెలిసిందే. ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగిపోతున్నాయని అలజడులు సృష్టించే ప్రయత్నంలో చిత్తూరు వెళుతున్న ఆయన్ను పోలీసులు ఎయిర్పోర్టులో అడ్డుకోవడంతో అక్కడే మూడు గంటలు బైఠాయించి నాటకాన్ని రక్తి కట్టించారు. గత ఏడాది జనవరి 8న అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్ర ప్రారంభించే పేరుతో విజయవాడ బెంజి సర్కిల్ వద్ద బైఠాయించి హడావుడి చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరి 27న విశాఖపట్నం ఎయిర్పోర్టు వద్ద నాలుగు గంటలు కార్యకర్తలతో బైఠాయించి హడావుడి చేశారు. అయినప్పటికీ టీడీపీని ఎవరూ పట్టించుకోవడం లేదని ఇటీవల జరిగిన వరుస ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది.
బాబు మెడకు రాయి కేసు
మరోసారి తాజాగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా మరోసారి విధ్వంసకర రాజకీయాలకు తెర తీశారు. సోమవారం సాయంత్రం చంద్రబాబు నిర్వహించిన తిరుపతి రోడ్ షోలో రాళ్ల దాడి జరిగిందంటూ హల్ చల్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు పోలీసులను తీవ్ర పదజాలంతో దూషించారు. పోలీసులు 5 నిమిషాలల్లో జవాబు చెప్పకపోతే మీ కథ తేలుస్తాం. ఇక్కడే పడుకుని నిరశన చేపడతా..’ అంటూ కేకలు వేశారు. పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగి వారిని దుర్భాషలాడారు. తర్వాత సమీపంలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న బాబు అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ పరిణామాల క్రమంలో పోలీసులు రాయి ఎపిసోడ్ ను సీరియస్ గా తీసుకున్నారు.
సభ జరిగిన కృష్ణాపురం ఠాణా పరిసరాల్లో సీసీ కెమెరాలను మొత్తం జల్లెడ పట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం తిరుపతిలో చంద్రబాబు బస చేస్తున్న బస్సు వద్దకు కూడా వచ్చారు. అక్కడ చంద్రబాబు వ్యక్తిగత, భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు. రాయి వేసిన వారిని చూశారా..? ఎటువంటి వచ్చాయో గమనించారా..? వంటి పలు ప్రశ్నలు సంధించారు. తిరుపతి అర్బన్ పోలీసులు తీసిన వీడియోను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సీసీ ఫుటేజీల మొత్తం పరిశీలించగా, చంద్రబాబు సభలో ఎక్కడా రాళ్లు పడినట్టు కనిపించ లేదు.
వాస్తవ పరిస్థితులు అలా లేవు…
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన పోలీసు శాఖ ఆ దిశగా విచారణ వేగవంతం చేసింది. అయితే, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు, వాస్తవ పరిస్థితులకు అసలు పొంతనే లేదని పోలీసుల విచారణలో తేలింది. చంద్రబాబు వ్యక్తిగత, భద్రతా సిబ్బంది కూడా ఇందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు అందించలేక పోయారు. మరి అలా ఎందుకు కేసు పెట్టారు? రాళ్ల దాడి అని ఎలా నిర్ధారించారు? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అలాగే దాడికి సంబంధించిన ఫుటేజీ ఏదైనా ఉంటే ఇవ్వాలని కూడా పేర్కొననున్నారు. దీంతో టీడీపీ వర్గాలు ఖంగుతింటున్నాయి. వ్యూహం వికటించి రివర్స్ అయిందా అన్న ఆందోళనలో ఉన్నారు. మరి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నాక చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.