Idream media
Idream media
ఓటు వేయాలనే అత్యుత్సాహం ఓ ప్రజా పతినిధికి తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఓటు ఉండి వేస్తే ఫర్వాలేదు.. కానీ దొంగ ఓటు వేసిన సదరు ప్రజా ప్రతినిధి ఇప్పుడు పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భర్తతో కలసి ఓటు వేశారు. చూపుడు వేలు చూపిస్తూ ఓటు వేసినట్లు మీడియాకు ఫోజులిచ్చారు. ఇక్కడే ఆమె దొరికిపోయారు.
డిగ్రీ అర్హత లేని తాటికొండ స్వప్న ఓటు ఎలా వేసిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరా తీశారు. ఆమె దొంగ ఓటు వేసినట్లు తేల్చారు. తాటికొండ స్వప్న అనే పేరు గల మహిళ ఓటును మున్సిపల్ చైర్మన్ అయిన స్వప్న ఓటు వేశారు. ఇద్దరి పేర్లు ఒకటే అయినా.. వారి భర్తల పేర్లు వేర్వేరు. మున్సిపల్ చైర్‌పర్సన్ కావడంతోనో లేదా గమనించలేదో గానీ ఎన్నికల సిబ్బంది ఆమె ఓటు వేసేందుకు అనుమతించారు. ఓటరు లిస్టు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు తాటికొండ స్వప్న చేసిన ఘనకార్యాన్ని బయటపెట్టారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని, పదవి నుంచి తొలగించాలని ఆందోళనలు చేశారు. స్వప్నకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఈ విషయాన్ని కేవలం రాజకీయపరమైన విమర్శలతో సరిపెట్టని కాంగ్రెస్ నేతలు.. ఆధారాలు సేకరించారు. వాటితో జిల్లా సహాయ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దొంగ ఓటు వేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. స్పందించిన ఎన్నికల సహాయ అధికారి.. వారి ఫిర్యాదును పరిశీలించారు. దొంగ ఓటు వేసినట్లు నిర్థారించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్నపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దొంగ ఓటు కేసు నుంచి ఎలా బయటపడాలో తెలియక మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న తల పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆమెను లక్ష్యంగా చేసుకుని ప్రతి చోటా నిరసనలకు దిగుతున్నారు. సాఫీగా సాగిపోతున్న రాజకీయ జీవితం దొంగ ఓటు వేయడం వల్ల తలకిందులైందని స్వప్న మథనపడుతున్నారు.
Also Read : నివేదిత అలక వీడినట్లేనా ?పార్టీ మార్పు ఆగిపోయినట్లేనా ?