iDreamPost
android-app
ios-app

లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు.. అనుకున్నది జగన్‌ సాధించబోతున్నారా..?

లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు.. అనుకున్నది జగన్‌ సాధించబోతున్నారా..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. బహుళార్థక ప్రాజెక్టు అయిన పోలవరం పనులు వడివడిగా సాగుతున్నాయి. దశాబ్ధాల తరబడి తెలుగు ప్రజలు కంటున్న కలలు సాకారమయ్యేలా పోలవరం పనుల్లో కీలక ఘట్టానికి గురువారం నాంధి పడింది. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా.. రాజకీయ నేతల హడావుడి కనిపించకుండానే.. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేలో గేట్లను బిగించేందుకు ప్రధానమైన ఆర్మ్‌ గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియకు ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు శ్రీకారం చుట్టారు.

సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ప్రాజెక్టు పూర్తిపై తనకున్న లక్ష్యాన్ని వారితో పంచుకున్నారు. ఓ క్రమ పద్ధతిలో ఏ ఏ పనులు ఎప్పటిలోపు పూర్తి చేయాలనేది షెడ్యూల్‌ ఇచ్చారు. మే నెలాఖరు లోపు గేట్ల ఏర్పాటు వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టు పూర్తయి 41.5 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేయడం, 2022 జూన్‌ నాటికి నీళ్లు అందించాలనే లక్ష్యాలను సీఎం జగన్‌ అధికారులకు నిర్థేశించారు. అందుకు అనుగుణంగా పనులు చేయాలని ఆదేశించారు. సీఎం జగన్‌ నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టులో పనులు ఊపందుకోవడం విశేషం.

వచ్చే ఏడాది మే నాటికి 48 గేట్లనూ అమర్చేందుకు అధికారులు పని చేస్తున్నారు. ఈ నెలాఖరు లోపు ఎనిమిది గేట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1128.40 మీటర్ల స్పిల్‌వేను 55 అడుగుల ఎత్తు మేర నిర్మిస్తున్నారు. 25.72 మీటర్లు నుంచి 45.72 మీటర్ల మధ్య గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో ఒక్కొక్క గేటును ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క గేటు అమర్చే ప్రక్రియ పూర్తికి 45 రోజుల సమయం పట్టనుంది.

తుది లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని పని చేస్తున్నారు. మే నాటికి గేట్లు ఏర్పాటు పూర్తి చేసి ఆ తర్వాత 2,454 మీటర్ల పొడవైన ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డాం నిర్మాణ పనులను చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. జూన్‌ తర్వాత గోదావరి నదికి వరద వస్తుంది. ఈ లోపు గేట్లు, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తి చేస్తే.. పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. వరద నీటిని గేట్ల ద్వారా విడుదల చేసి.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలకు మధ్యలో ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం నిర్మాణ పనులను చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో పనులు చేస్తున్నారు. పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితే.. సీఎం వైఎస్‌ జగన్‌ అనుకున్నట్లుగా 2020 ఖరీఫ్‌కు పోలవరం నుంచి నీళ్లు అందుతాయి.