Idream media
Idream media
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు అత్యంత అవసరమైనది, కీలకమైనది. అందుకే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాజెక్టు పనులు మందగించకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పనుల్లో వేగం పుంజుకుంది. కేంద్రం నిర్ణీత సమయానికి నిధులు ఇవ్వకపోయినా, సొంత నిధులు వెచ్చిస్తూ పనులు ఆగకుండా చూస్తోంది. అలాగే పోలవరం నిర్వాసితుల విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
జగన్ చిత్తశుద్ధి కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పోలవరం దిగువ కాఫర్ డ్యాం డయా ఫ్రమ్‌వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 96 మీటర్ల పొడవు, పది మీటర్ల లోతు,1.2 మీటర్ల వెడల్పుతో ఢయా ప్రం వాల్ నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ సోమవారం ప్రారంభించింది. దిగువ కాఫర్ డ్యాం లో 63000 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. దిగువ కాఫర్ డ్యాం దగ్గర నదిలో గ్యాప్‌లను పూడ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంపై జలవనరులశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం అనంతరం ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణంపై దృష్టి సారించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి అవ్వగానే ఈసీఆర్ఎఫ్ పనులు మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
ఓ వైపు పనుల వేగంపై దృష్టి పెడుతూనే.. ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందిస్తోంది. పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచింది. ఇది నిజంగా నిర్వాసిత గ్రామాల్లో ఆనందం నింపే విషయమే. ఎందుకంటే నిర్వాసితులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారమైంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని రూ.10 లక్షలు చెల్లిస్తామని గతంలో సీఎం హామీఇచ్చారు. అన్నట్లుగానే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఆ పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అదనపు చెల్లింపుల నేపథ్యంలో ప్రభుత్వంపై రూ. 550 కోట్ల అదనపు భారం పడనుంది. పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో.. నిర్వాసితుల సమస్య పరిష్కారం కూడా ముఖ్యమని భావించిన సీఎం జగన్ ఈ భారాన్ని లెక్కచెయ్యకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నలభై నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఆ గ్రామాల ప్రజల్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వాసితులను తరలించేందుకు నిర్మిస్తున్న పునరావాస గృహ నిర్మాణాలు ఇప్పటికే అన్ని సౌకర్యాలతో సిద్ధమయ్యాయి. దీనికి తోడు ప్రభుత్వం నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించేలా నిర్ణయం తీసుకోవడం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి దోహదపడనుంది.