iDreamPost
android-app
ios-app

తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ!

తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలో పర్యటించారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి నేరుగా మహబూబ్ నగర్  చేరుకొన్నారు. అమిస్తాపూర్ లోని ఐటీఐ కాలేజీ మైదానంలో ప్రజాగర్జన పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. అంతేకాక తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అలానే ములుగు జిల్లాలో  కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఆ యూనివర్సిటీ పేరును సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్‌ యూనివర్సిటీ అంటూ వెల్లడించారు. ఇక ఈ సభలో మోదీ కీలక అంశాలను ప్రస్తావించారు.

ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. పాలమూరు జిల్లాకు మోదీ రావడం ఇదే రెండోసారి. ఇక మోదీ సభ కోసం మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి దాదాపు రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఇక పాలమూరు బహిరంగ సభలో పాల్గొన్న మోదీ కీలక ప్రసంగం చేశారు. అయితే ఇది కేవలం టీజర్ అన్నట్లు.. అసలు సినిమా తరువాత చూపిస్తా అన్నట్లు మోదీ ప్రసంగం సాగింది. దాదాపు రూ.13,545 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఇక మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా, చాలా సంతోషంగా ఉంది అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.  తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అలానే మలుగుజిల్లాలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆ యూనివర్సిటీకి సమక్క, సారక్కల పేర్లు పెట్టనున్నట్లు  మోదీ తెలిపారు. కాచిగూడ-రాయ్ చూర్ మధ్య కొత్త రైలును మోదీ ప్రారంభించారు.

వరంగల్ -ఖమ్మం-విజయవాడ హైవే పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం- హైదరాబాద్ మల్టీ ప్రాజెక్ట్ పైప్ లైన్ ను ఆయన ప్రారంభించారు. రూ.2457 కోట్లతో  నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం హైవేకు శ్రీకారం చుట్టారు. మునీరాబాద్-మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ లో భాగమైన జక్లేర్-కృష్ణా రైల్వే లైన్ జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన అయిదు క్రొత్త భవనాలను ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించారు. మరి.. తెలంగాణపై వరాల జల్లు కురిపిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.