iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ కు మోడీ.. ఆహ్వానం ప‌లికేందుకు వెళ్ళని కేసీఆర్..

హైదరాబాద్ కు మోడీ.. ఆహ్వానం ప‌లికేందుకు  వెళ్ళని కేసీఆర్..

న‌గ‌రానికి చేరుకున్న ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిని క‌లిగిస్తోంది. హైద‌రాబాద్ కు వ‌చ్చే ముందే ఇక్క‌డ‌కు వ‌చ్చేందుకు ఎదురుచూస్తున్నా అంటూ ఉద్విగ్న‌భ‌రితంగా ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయ‌నే న‌గ‌రంలో త‌న ప‌ర్య‌ట‌న తాలూకు వివ‌రాలను వెల్ల‌డించారు. ‘హైదరాబాద్ కు రావడానికి నేను ఎదురుచూస్తున్నా. హైదరాబాద్ లో రెండు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ICRISAT 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనబోతున్నాను. వ్యవసాయం, ఆవిష్కరణల రంగంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ఎంతో ముఖ్యమైన ఇన్స్టిట్యూట్ ఇది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రెండో ట్వీట్ లో ‘సాయంత్రం ఐదు గంటలకు సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల ‘statue of equality’ విగ్రహావిష్కరణలో పాల్గొనబోతున్నాను. తన ఆధ్యాత్మిక బోధనలతో మనల్ని ఉత్తేజితం చేసిన రామానుజుల వారికి ఇది గొప్ప ట్రిబ్యూట్’ అని మోదీ ట్వీట్ చేశారు.

ఇక న‌గ‌రాన్ని మోడీ చేరుకుంటార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచీ ఆహ్వానం ప‌లికేందుకు కేసీఆర్ వెళ్తారా, లేదా అనే చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. దానిపై నిన్న క్లారిటీ వ‌చ్చింది. మోడీ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ దూరం ఉంటున్న‌ట్లు తెలిసింది. ఆయ‌న బ‌దులు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ పాల్గొంటార‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అన్న‌ట్లుగానే ఈ రోజు 2.10 గంట‌ల త‌ర్వాత న‌గ‌రానికి చేరుకున్న మోడీకి గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై, కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్, సీఎస్ సోమేశ్ కుమార్ స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డి నుంచి మోడీ ప‌టాన్ చెరువులో ఉన్న ఇక్రిశాట్ కు చేరుకున్నారు. ఆయ‌న‌తో పాటు కేంద్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ కూడా ఇక్రిశాట్ 50 ఏళ్ల వేడుక‌లో పాల్గొన్నారు. అక్క‌డి ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించారు. శాస్త్ర‌వేత్త‌లు మెట్ట‌ పంట‌ల ప‌రిశోధ‌న‌ల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. తోమ‌ర్ మాట్లాడిన అనంత‌రం మోడీ 50 ఏళ్ల ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్ ను ఆవిష్క‌రించారు. అనంత‌రం మోడీ సాయంత్రం ఐదు గంట‌ల‌కు ముచ్చింత‌ల్ లో కొలువైన అతి భారీ రామానుజాచార్యుల వారి విగ్ర‌హాన్ని జాతికి అంకితం చేయ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా.. వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై ప్రత్యక్షంగా యుద్దం మొదలుపెట్టిన సీఎం కేసీఆర్‌.. ఇటీవల కేంద్రం, బీజేపీ తీరుపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోడీపైనా మండిపడుతున్నారు. తాజాగా నాలుగు రోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ.. ప్రధాని, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ వైఫల్యాలను ఆయన ఎదురుగానే ఎత్తిచూపుతానని, తాను ఎవరికీ భయపడేరకం కాదనీ ప్రకటించారు. ఇలా ఘాటుగా విమర్శలు చేస్తూనే.. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానికి ప్రోటోకాల్‌ ప్రకారం స్వాగతం పలుకుతానని ప్రకటించారు.కానీ శనివారం ప్రధాని పర్యటనలో స్వాగత బాధ్యతలను మంత్రి తలసానికి అప్పగించారు. ఆయ‌న‌కు జ్వ‌రం, స్వ‌ల్ప అస్వ‌స్థ‌త కార‌ణంగానే ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికేందుకు వెళ్ల‌లేద‌ని తెలుస్తోంది.