Idream media
Idream media
అది విజయనగరం జిల్లాలోని మారుమూల గ్రామం. అక్కడి ప్రజలు పచ్చదనం, పరిశుభ్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు. ప్రభుత్వాల పిలుపునకు స్పందించి ఉత్సాహంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫలితంగా ఆ గ్రామంలో పచ్చదనం ఫరిడవిల్లుతోంది. పరిసరాలు పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ఆ గ్రామమే విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని భూదేవి పేట.
మంచినీటి సదుపాయం, స్వచ్ఛభారత్ కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో భూదేవి పేట స్పందన కలిగిన గ్రామంగా ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూదేవి పేట గ్రామాన్ని అభినందించారు. ఆ గ్రామాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్పందించి గ్రామాన్ని అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దుకున్న ప్రజలను భేష్ అంటూ అభినందించారు.
Read Also:- బద్వేల్ ఉప ఎన్నిక టీడీపీ, జనసేన ఔట్ : నిజంగా సానుభూతేనా? లేక ఈ కారణాలున్నాయా?
సమావేశానికి హాజరైన డీపీఓ సుభాషిణి గ్రామాన్ని ఒకసారి పరిశీలించి పచ్చదనం పరిశుభ్రత, మంచినీటి కనెక్షన్లలో ముందంజలో ఉండడంతో భూదేవి పేట గ్రామ సర్పంచ్ కనకల ప్రవీణ, ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బందిని అభినందించారు. గ్రామంలో ఉన్న 144 కుటుంబాలకు పూర్తిగా మంచి నీటి కుళాయి కనెక్షన్ ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశ ప్రధాని దృష్టిలో పడడం గర్వ కారణమని అన్నారు. మోదీ గ్రామాన్ని అభినందిస్తూ చేసిన ప్రసంగాన్ని అధికారులతో పాటు గ్రామస్తులు కూడా విని సంతోషం వ్యక్తం చేశారు.
Read Also:- రైతుల పై దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కుమారుడి కారు , 8 మంది మృతి
స్వచ్ఛ భారత్ అమలుతో పాటు.. ఏపీ ప్రభుత్వం కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఏపీ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా శానిటేషన్‌పై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. పరిసరాల పరిశుభ్రత ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలని ప్రచారం నిర్వహిస్తోంది. అలాగే.. జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ వర్షా కాలం సీజన్ భారీ స్థాయిలో మొక్కలు నాటుతోంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.