ఒకేసారి కాదు.. దశలవారీగా.. లాక్‌డౌన్‌పై ప్రధాని కసరత్తు

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14వ తేదీ వరకేనా..? లేక ఆ తర్వాత కొనసాగుతుందా..? అప్పట్లోగా వైరస్‌ ప్రభావం తగ్గితే సరే..? లేదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగిస్తే తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయి..? అందు కోసం ఎలా సిద్ధమవ్వాలి..? ఇదీ నిన్నటి వరకూ దేశ ప్రజల మెదల్లో మెదిలిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ప్రధాని మోదీ సూచాయగా జవాబిచ్చారు. ఈ రోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ కట్టడి, లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న తీరుపై చర్చించారు.

సీఎంల భేటీలో లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ప్రధాని మోదీ సూచాయగా వెల్లడించారని సమాచారం. ఒకేసారి కాకుండా విడదల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ప్రధాని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి..? వాటిని ఎలా ఎదుర్కొవాలనే అంశాలపై ప్రధాని మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పలు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

ఒకేసారి ప్రజలందరూ రోడ్లపైకి వస్తే.. పరిస్థితి మళ్లీ అదుపుతప్పుతుందని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. కరోనా వైరస్‌ పూర్తిగా నియంత్రణలోకి రాకముందే లాక్‌డౌన్‌ ఎత్తివేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైరస్‌ మళ్లీ పంజా విసిరితే.. పరిస్థితి విషమిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్‌ అధికంగా ఉన్న పట్టణాలు, ప్రాంతాలు, జిల్లాలపై పలు అంక్షలు విధించే అవకాశం ఉంది. దుకాణాలు, వివిధ వ్యాపారాలు, కంపెనీలు యథావిధిగా పని చేసినా.. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.

గత నెల 25వ తేదీన దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ 21 రోజులుపాటు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. అంతకు ముందు 22వ తేదీన దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను విధించారు. ఆ మరుసటి రోజు నుంచే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించుకున్నాయి. ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కేంద్ర విధించిన లాక్‌డౌన్‌ 21 రోజులైనా.. ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో అది 24 రోజుల పాటు కొనసాగినట్లువుతుంది.

Show comments