iDreamPost
iDreamPost
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధోరణి మారింది. తన సహజశైలికి భిన్నంగా ఆయన వ్యవహరించారు. గడిచిన ఏడేళ్లలో ఎన్నడూ ప్రభుత్వ విధానాల లోపాన్ని అంగీకరించని ప్రధాని తొలిసారిగా వ్యాక్సినేషన్ విషయంలో కొన్ని లోపాలున్నట్టు అంగీకరించారు. గతంలో గుజరాత్ సీఎంగానూ, ఆ తర్వాత ప్రధానిగానూ నిత్యం ఎదురుదాడి మంత్రం జపించిన ఆయన తొలిసారిగా ఇలాంటి ప్రకటన చేయడం ఆసక్తిగా మారింది. రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చింది. మీడియాలో కొన్ని వర్గాలు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చాయి. ఇంత పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉండవచ్చు ఇవీ ప్రదాని వ్యాఖ్యలు. ముఖ్యమంత్రులు లేఖలు రాయడం. జార్ఖండ్, ఢిల్లీ సీఎంలు నేరుగా వీడియో కాన్ఫరెన్సులోనే నిలదీయడం వంటి పరిణామాలు ప్రధానిని ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది. ఇక వ్యాక్సిన్ల ధర, సరఫరా విషయంలో కేంద్రం తీరుని మీడియా, సోషల్ మీడియా తీవ్రంగా వ్యతిరేకించాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా వ్యాక్సిన్ ధరల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా అన్ని వైపులా కేంద్రం మీద ఒత్తిడి రావడంతో ఒక అడుగు వెనక్కి వేసినట్టు తెలుస్తోంది.
గతంలో ఎంత ఒత్తిడి వచ్చినా తన నిర్ణయం తనదే అన్నట్టుగా మోడీ సాగిపోయారు. దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన డీమోనిటైజేషన్ నుంచి అనేక అంశాల్లో అదే తీరు. కానీ తొలిసారిగా వ్యాక్సిన్ల విషయంలో ప్రధానమంత్రి నిర్ణయం మార్చుకున్నారు. రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని, 18ఏళ్ల వరకూ ఉన్న వారందరికీ ఉచితంగా ఇస్తామని, ప్రైవేటుగా టీకా వేయించుకున్నా దానికి సర్వీసు ఛార్జ్ తప్ప అదనపు భారం ఉండదని చెబుతూ పలు ఊరట కల్పించే ప్రకటనలు చేశారు. ప్రధాని చెప్పినట్టు ఈనెల 21 నుంచే 18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ అంటూ చేసిన ప్రకటన గానీ, నవంబర్ నాటికి 80 శాతం మందికి టీకాలంటూ చెప్పిన మాటలు గానీ ఆచరణ రూపం దాలుస్తాయా లేదా అన్నది పక్కన పెడితే కేంద్రం తన నిర్ణయం మార్చుకుని, ప్రజల , విపక్షాల ఒత్తిడికి తలొగ్గడం మాత్రం కీలకాంశం.
రాజకీయంగా కరోనా సెకండ్ వేవ్ పరిణామాలు మోడీ ప్రభుత్వాన్ని రక్షణలోకి నెట్టాయి. బెంగాల్ లో ఎన్నికల ఓటమి, త్వరలోనే యూపీ ఎన్నికలు ఉండడం వంటి పరిణామాలు మోడీ నిర్ణయం మార్చుకోవడానికి మూల కారణాలుగా అంచనా వేస్తున్నారు. ఇటీవల ఆర్ఎస్ఎస్, బీజేపీ కీలక నేతల సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఇలాంటి ఉపశమనం దేశ ప్రజలకు దక్కిందని చెబుతున్నారు. త్వరలో మరిన్ని సానుకూల ప్రకటనలు కూడా రావచ్చని భావిస్తున్నారు. ప్రస్త్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో దానిని చల్లార్చేందుకు ఉపశమనం చర్యలకు ఉపక్రమించినట్టుగా కొందరు చెబుతున్నారు. ఏమయినా మోడీ కీలక ప్రకటన దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని మాత్రం చెప్పవచ్చు.