విజయవాడలోని పండిట్ నెహ్రు బస్ స్టేషన్లో ప్లాస్టిక్ డబ్బాలు క్రషింగ్ చేసే యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. గతంలో అలాంటి యంత్రాన్ని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో అధికారులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానికి తోడుగా మరో యంత్రాన్ని విశాఖపట్నం ప్లాట్‌ఫాం వద్ద ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ బస్ స్టేషన్లో పోగు పడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్లాస్టిక్ డబ్బాల క్రషింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల ద్వారా క్రష్ అయిన ప్లాస్టిక్ ముక్కలను ఆటో నగర్ పంపించి రీసైక్లింగ్ కర్మాగారానికి పంపిస్తారు.
ప్లాస్టిక్ డబ్బాలు ఈ క్రషింగ్ యంత్రంలో వేసిన వారికి రెండు రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యే విధంగా అధికారులు ఏర్పాటు చేసారు.రెండు రూపాయలు పొందాలి అంటే ముందుగా ప్లాస్టిక్ డబ్బాని క్రషింగ్ యంత్రంలో వేయాలి. అనంతరం మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన అనంతరం మీ బ్యాంక్ ఖాతాలో రెండు రూపాయలు జమ అవుతాయి. గతంలో హైదరాబాద్ ప్లాట్‌ఫాం వద్ద ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయగా మరో యంత్రాన్ని విశాఖపట్నం ప్లాట్‌ఫాం వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో యంత్రం తయారీకి రెండు లక్షల ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు.