Idream media
Idream media
పశ్చిమ బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్(పీకే) తాజాగా బీజేపీ నేతలకు మరో సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు రాకుంటే పదవుల నుంచి తప్పుకుంటారా..? అని పీకే ఛాలెంజ్ విసిరారు. రాబోవు శాసన సభ ఎన్నికల్లో 200కు పైగా సీట్లు గెలిచి అధికారం చేపడతామని బీజేపీ నేతలు ఇటీవల ప్రకటిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేత, హోం మంత్రి అమిత్‌షా మొదలుకుని పలువురు నేతలు 200 సీట్లు గెలుస్తామనే ప్రకటనలు చేస్తుండడంతో.. ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. ఆ పార్టీకి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. 200 కాదు కదా.. 99 సీట్లు గెలవడమే బీజేపీకి కష్టంగా ఉంటుందని, 99 సీట్లు కన్నా ఎక్కువ గెలిస్తే.. తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని పీకే సోమవారం ట్వీట్ చేశారు.
పీకేకు బీజేపీ నేతలు కూడా గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. అయితే అంకెల ఛాలెంజ్‌పై మాత్రం సూటిగా స్పందించడం లేదు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశం ఓ రాజకీయ వ్యూహకర్తను కోల్పోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కౌలాష్ విజయ్‌వర్గీయ పరోక్షంగా పీకే గురించి మాట్లాడారు. అయితే పీకే మళ్లీ ఈ రోజు మరో ఛాలెంజ్ చేయడం రాజకీయ పరిశీలకులను ఆలోచింపజేస్తోంది.
తృణముల్ కాంగ్రెస్‌కు కర్త, కర్మ, క్రియ అంతా మమతా బెనర్జీ దీదీ)నే. దీదీని సవాల్ చేస్తున్న బీజేపీ.. జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దించుతోంది. అమిత్‌షాతోపాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ స్థాయి నేతలు బెంగాల్‌ను చుట్టేస్తున్నారు. టీఎంసీ నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు. టీఎంసీలో నంబర్ 2గా, దీదీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సీనియర్‌నేత సువేందు అధికారి ఇటీవల బీజేపీలో చేరారు. ఆయనతోపాటు మరో పది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక మాజీ ఎంపీ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం టీఎంసీకి పెద్ద దెబ్బగా మారింది. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. 42 ఎంపీలకు గాను 18 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఈ పరిణామలతో రాబోయే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి చెక్ పెట్టేందు, మళ్లీ టీఎంసీ వైపు ప్రజలను మళ్లించేందుకే పీకే సవాళ్ల రాజకీయం మొదలుపెట్టారనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ అంకెల సవాళ్లకు బీజేపీ నేతలు సూటిగా స్పందించకపోవడంతో పీకే పైచేయి సాధించారనే చెప్పవచ్చు. వచ్చే మేలో జరిగే బెంగాల్ శాసన సభ (294) ఎన్నికల్లో టీఎంసీ గెలిస్తే.. హ్యాట్రిక్ కొట్టినట్లవుతుంది. లేదంటే బీజేపీ మొదటిసారి పాగా వేస్తుంది.