iDreamPost
android-app
ios-app

బైరెడ్డి సిద్దార్థ రెడ్డి జన్మదిన వేడుకల్లో కనిపించని వైసిపి నేతల ఫోటోలు

బైరెడ్డి సిద్దార్థ రెడ్డి జన్మదిన వేడుకల్లో కనిపించని వైసిపి నేతల ఫోటోలు

సోమవారం కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైసిపి సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థ రెడ్డి జన్మదిన వేడుకల్లో సిద్దార్ధ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జిల్లా వైసిపి నేతల ఫోటోలు లేకపోవడంపై ఇప్పుడు కర్నూల్ జిల్లా నాయకులు, కార్యకర్తల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఇటీవల సిద్దార్థరెడ్డి వర్గానికి స్థానిక ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గానికి మధ్య విబేధాలు తారాస్ధాయికి చేరాయి. వలాంటీర్ల ఎంపిక మొదలు బదిలీలు, చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్స్ అన్ని ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గానికే ఇస్తున్నారని సిద్దార్ధ్ రెడ్డి వర్గం అసంతృప్తితో ఉంది. అయితే ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆర్ధర్ అనుచరులు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై విరుచుకుపడడంతో నందికొట్కూరు రాజకీయం రసకందాయంలో పడింది.

నందికొట్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దార్ధ వర్గానికి చెందిన తువ్వా మల్లారెడ్డి కి ఇస్తున్నారని తెలిసిన ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గీయులు రెచ్చిపోయారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని జిల్లాలో అడుగుపెట్టనివ్వమని వార్ణింగ్ ఇవ్వడంతో జిల్లా వైసీపి లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సిద్దార్ధ్ రెడ్డి లేకుండా నందికొట్కూరు రాజకీయాలపై పట్టు సాధించలేమని వైసిపి అధిష్టానం భావిస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సిద్దార్ధ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు కర్నూల్, నందికొట్కూరు లో హంగామా చేశారు. ఎక్కడ చూసినా సిద్దార్ధ రెడ్డి ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

అయితే బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీలలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి జగన్, ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తప్ప మిగతా కర్నూల్ జిల్లా నాయకులు ఎవరు కనిపించలేదు. ఇప్పటికే జిల్లా నేతలను కలుపుకొని పోవడం లేదని సిద్దార్ధ మీద పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఈ అంశాన్ని జిలా నాయకులు పలుమార్లు జగన్ దృష్టికి తీసుకుపోయారు. దీనితో సిద్దార్ధ్ రెడ్డిని పిలిపించి అందరితో కలసి పనిచేయమని ముఖమంత్రి సూచించారని ప్రచారం జరిగింది. అయితే నిన్న జరిగిన జన్మదిన వేడుకలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూస్తే సిద్దార్ధ రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని అర్ధమౌతుంది.

ఈ నేపథ్యంలో జిల్లా నేతలందరితో సిద్దార్ధ రెడ్డి సఖ్యతగా ఉంటూ అందరిని కలుపుకొని ముందుకెళితేనే అతనికి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని జిల్లా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరి అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో ఇలానే ఒంటరిగా ముందుకెళితే ఎలా రాణిస్తాడని కొందరు కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.