Idream media
Idream media
లాక్‌డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేసి 50 రోజులు దాటిపోయింది. తిరిగి ఎప్పుడు దర్శనాలను ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ శ్రీవారి హుండీ ఖాళీగా ఉండడం లేదు. ప్రతిరోజూ అంతోఇంతో డబ్బులు హుండీలోకి వెళ్తున్నాయి. భక్తులు లేకుండా హుండీలోకి డబ్బులు ఎలా వెళ్తున్నాయి అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.
శ్రీవారి ఆలయం గత కొద్ది రోజులుగా తెరుచుకోకపోయినా నిత్యం పూజారులు శాస్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తిరుమలలో పారిశుధ్య సిబ్బంది, భద్రతా సిబ్బంది, పలువురు ఉద్యోగులు మొత్తంగా 100, 150 మంది ప్రతిరోజూ తిరుమల ఆలయం వద్ద ఉంటూనే ఉంటారు. అలాగే టీటీడీ పాలకమండలి సభ్యులు అప్పుడప్పుడూ అక్కడకు వస్తున్నారు. వీరంతా శ్రీవారిపై తమకున్న భక్తిని చాటుకుంటూ హుండీని ఖాళీగా ఉంచకుండా ప్రతిరోజూ తమకు తోచిన మేర కానుకలు సమర్పిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ మొత్తం రోజుల్లో పది వేల నుంచి అత్యధికంగా 2 లక్షల వరకు కానుకలు హుండీలోకి వెళ్లడం గమనార్హం. ఇప్పటివరకు 20 లక్షల వరకు కానుకలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
లక్షల నుంచి కోట్లకు..
శ్రీనివాసుడు ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న దేవుడు. 1958వ సంవత్సరంలో శ్రీవారికి మొదటి సారిగా ఒక రోజే హుండీ ద్వారా లభించే ఆదాయం లక్ష రూపాయలు దాటింది. కాలక్రమంలో శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో 1990 నాటికి శ్రీవారికి హుండీ ద్వారా లభించే ఆదాయం కోటి రూపాయలు దాటింది. అప్పటి నుంచి స్వామి వారికి లభించే ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ప్రతిరోజూ సగటున 3.56 కోట్ల హుండీ ఆదాయం వస్తోంది. 2012 ఏప్రిల్ 2న అత్యధికంగా ఒక్క రోజులో హుండీ ద్వారా రూ. 5.78 కోట్లు లభించింది. ప్రస్తుతం ప్రతి ఏటా శ్రీవారికి లభిస్తున్న హూండీ ఆదాయం సగటున రూ. 1,300 కోట్లకు చేరుకుంది. దాని తర్వాత శ్రీవారికి ఎక్కువ మొత్తంలో ఆదాయం లభించేది ఫిక్స్‌డ్ డిఫాజిట్లపైనే. వడ్డీ ద్వారా దాదాపు రూ. 700 కోట్లు, లడ్డూ విక్రయాల ద్వారా 400 కోట్లు వస్తుంది. ఇంకా తలనీలాలు, అద్దెల ద్వారా వచ్చే ఆదాయం అదనం. ప్రస్తుతం టీటీడీ వార్షిక బడ్జెట్ రూ. 3,309 కోట్లకు చేరుకుంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ టీటీడీ అంచనాలను తలకిందులు చేస్తోంది. ఈ ఏడాది వెయ్యి కోట్ల వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
త్వరలో ఆలయం తెరుచుకుంటుందా?
కేంద్రం పొడిగించిన లాక్‌డౌన్ మార్చి 17తో ముగియనుంది. తర్వాత పరిస్థితి ఏంటి అన్న దానిపై నేడో రేపో స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో దర్శనాల పునర్ధురణపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వేలాదిగా వచ్చే భక్తుల మధ్య భౌతిక దూరాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, అద్దె గదుల వద్ద, షాపుల వద్ద ఎలాంటి ఏర్పాటు చేయాలి అన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే భక్తులకు పాస్‌లు జారీ చేసి, ఆ మేరకు భక్తులను సమయాల వారీగా ఆలయంలోకి అనుమతిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం.