iDreamPost
iDreamPost
గత రెండున్నరేళ్ళుగా కరోనా ప్రపంచాన్ని వదిలిపోవట్లేదు. ఎంతో మంది ఈ కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడి మరణించిన సంఖ్యా కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ప్రజలు ఏ రోజు ఏ కొత్త వైరస్ వస్తుందో అని భయంతో బతుకుతున్నారు. తాజాగా గత కొన్ని రోజుల నుంచి మరో వైరస్ అందర్నీ భయపెడుతుంది. ఆ వైరస్ పేరు మంకీ పాక్స్. ఇప్పటికే ఆఫ్రికా, బ్రిటన్, అమెరికా దేశాల్లో ఈ మంకీ పాక్స్ కేసులు బయటపడుతున్నాయి. కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో జనాలు భయపడుతున్నారు.
దీంతో ఈ మంకీ పాక్స్ కూడా కరోనా లాగే అందరికి వ్యాపిస్తుందా? దీనికి నివారణ ఉందా? దీనివల్ల చనిపోతారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ప్రజల్లో. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన పలువురు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు దీని గురించి వివరణ ఇచ్చారు. మంకీ పాక్స్ గురించి మాట్లాడుతూ.. మంకీపాక్స్ కేసులు ఆందోళన కలిగిస్తున్న విషయం నిజమే కాని, ఇది కరోనా వైరస్‌లా మారే అవకాశం లేదు అని తెలిపారు. మంకీపాక్స్ అనేది కొత్తగా పుట్టిన వైరస్ కాదు, గతంలో ఉన్న మశూచి లాంటిదే. దీనికి ఆ వ్యాక్సిన్ లని వాడితే నివారించొచ్చు. మంకీపాక్స్ గాలి ద్వారా వ్యాపించదు. కరోనా లాగా అంత ప్రమాదకరం కూడా కాదు అని తెలిపారు. మశూచి టీకాతో మంకీపాక్స్‌ను నయం చేయవచ్చు, ఆందోళన చెందవద్దు అని తెలిపారు నిపుణులు.
తాజాగా జపాన్‌లో జరుగుతున్న క్వాడ్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మంకీ పాక్స్ గురించి మాట్లాడారు. జో బైడెన్ మాట్లాడుతూ.. కరోనా తరహాలో మంకీపాక్స్ వ్యాపించదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 100 కేసులు నమోదయ్యాయి. మశూచి టీకాతో మంకీపాక్స్‌ను అడ్డుకోవచ్చని నిపుణులు తెలిపారు. అమెరికాలో ఈ వైరస్‌ను అరికట్టేందుకు సరిపడా వ్యాక్సిన్ నిల్వలు కూడా ఉన్నాయని అన్నారు.