Idream media
Idream media
పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం.. మూడింటిని ఒకేగాటన కట్టి సీఎం వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారు. వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ… నిర్ధేశిత సమయంలో వాటిని అమలు చేసి ఫలితాలు రాబట్టాలని భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో జగన్ దూకుడు రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేస్తుండగా.. పరిపాలనా పరమైన నిర్ణయాల్లో కొన్ని ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హౌస్‌హోల్డ్ సర్వే ప్రజలకు తిప్పలు తెచ్చిపెడుతోంది. స్వల్పకాలంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాలు నిర్థేశించుకుంది. ఈ నెల 12న హౌస్‌హోల్ట్ సర్వే చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలోని పెద్ద ఆధార్ నంబర్, వేలి ముద్ర ద్వారా రేషన్‌కార్డు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా రెండు యాప్‌లు రూపొందించారు. వాలంటీర్ యాక్సిస్ నుంచి ఈ యాప్‌లు ఉపయోగించుకుని సర్వే చేస్తున్నారు.
వాలంటీర్లకు శిక్షణ, పూర్తి సమాచారం అనంతరం ఈ నెల 15 నాటికి ఈ సర్వేకు సంబంధించిన అవగాహన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు వచ్చింది. 18వ తేదీలోపు హౌస్‌హోల్డ్ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం మూడు రోజుల్లో ఈ సర్వే పూర్తి కావాలి.
ఉపాధి కోసం, ఉద్యోగాలు చేస్తూ నగరాల్లో ఉంటున్న వారికి వాలంటీర్లు ఫోన్‌లు చేసి అసలు విషయం చెప్పారు. ఈ సర్వే చేయించుకుంటేనే రేషన్‌కార్డు ఉంటుందని, లేదంటే పోతుందని అధికారులు చెప్పిన విషయం వాలంటీర్లు ప్రజలకు చెప్పారు. దీంతో ఉరుకులు పరుగులతో ఇతర ప్రాంతాల్లో ఉండే వారు స్వగ్రామాలకు చేరుకున్నారు. సరైన రవాణా సౌకర్యం లేకపోయినా ఆపసోపాలు పడి ఇళ్లకు చేరుకున్నారు.
రాష్ట్రంలో దాదాపు 1.42 కోట్ల రేషన్‌కార్డులున్నాయి. ఈ కుటుంబాలన్నింటినీ మూడు రోజుల్లో సర్వే జాబితాలో చేర్చేందుకు అవసరమైన మానవ వనరులు వాలంటీర్ల రూపంలో ఉన్నారు. గ్రామాల్లో 50 కుటుంబాలు, పట్టణాల్లో 100 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లు ఉన్నారు. అయితే ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో సర్వే ప్రారంభించడంతో.. సర్వర్ మోరాయించింది. మూడు రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది. మరో వైపు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిపోతోంది. వాలంటీర్లు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ పెద్దలు గ్రామాలకు చేరుకున్నారు. ఒక రోజుతో పని పూర్తయి సాయంత్రం మళ్లీ తిరుగుప్రయాణం అవుదామనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఈ సర్వే జరగడంతో సర్వర్ మోరాయించింది. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రజలు ఉపాధి కోసం బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, గుంటూరులకు కొన్నేళ్లుగా వలస వెళుతున్నారు. వీరందరూ తాము చేస్తున్న పనులను ఆపేసి హడావుడిగా ఇళ్లకు చేరుకున్నారు. సర్వర్ మొరాయించడంతో ఇళ్ల వద్దే ఆగిపోయారు. హడావుడిగా చేస్తున్న సర్వే వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం గుర్తించాలి. భవిష్యత్‌లో సర్వేలకు నిర్ణీత గడువు విధించినా.. ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.