iDreamPost
iDreamPost
ప్రపంచమంతా కోవిడ్ తో అల్లాడుతోంది. దాన్నుంచి రక్షణకు దాదాపు అన్ని దేశాలు పలు రకాల ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఆయా దేశాల ప్రభుత్వాలు తమ పౌరులకు కోవిడ్ టీకాలు తప్పనిసరి చేశాయి. ఒమిక్రాన్ నుంచి రక్షణకు బూస్టర్ డోస్ కూడా వేస్తున్నారు. కానీ చిత్రంగా ఇటువంటి చర్యలు తీసుకోవడమే తప్పు అన్నట్లు కెనడా ప్రజలు ప్రవర్తిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై తిరగబడ్డారు. లక్షలాదిమంది రోడ్లపైకి వచ్చి రాజధాని ఒట్టావా లోకి చొరబడ్డారు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని జస్టిస్ ట్రూడో, అతని కుటుంబ సభ్యులను భద్రతాధికారులు అజ్ఞాత ప్రదేశానికి తరలించారు.
రాజధానిలో నిరసన జ్వాలలు
ప్రస్తుతం కెనడాలో 2.33 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. 33వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు కఠినతరం చేసింది. పౌరులందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్కులు ధరించాలని ఆదేశించింది. అలాగే పరిస్థితిని బట్టి లాక్ డౌన్లు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఆంక్షలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు స్వేచ్ఛ కావాలంటూ లక్షలాదిగా రోడ్లపైకి వచ్చారు. భారీ ట్రక్కులు, ఇతర వాహనాల్లో రాజధానిని ముట్టడించారు. భద్రత బలగాలు భారీగా మోహరించినా ఖాతరు చేయకుండా వేలాదిగా నగరంలోకి చొరబడ్డారు. అక్కడి వార్ మెమోరియల్ వద్ద బైఠాయించారు. స్వస్తిక్ ముద్ర ఉన్న జెండాలు, ఆంక్షల నుంచి స్వేచ్ఛ కావాలన్న నినాదాలతో బ్యానర్లు ప్రదర్శించారు. కెనడా హీరోగా భావించే టెర్రిఫాక్స్ విగ్రహాలను కూడా కొందరు తీసుకొచ్చారు. తొలుత పదివేలమందితో మొదలైన ఆందోళనలు.. క్రమంగా నిరసనకారులు వరద ప్రవాహంలా తరలిరావడంతో ఒట్టావా లో ఉద్రిక్తతలు అలుముకున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పలుచోట్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు.
భద్రత కట్టుదిట్టం
రాజధానిలోకి చొరబడిన వేలాదిమంది నిరసనకారులు ప్రధాని కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని దిగ్బంధించే ప్రమాదం ఉందని పార్లమెంటరీ ప్రొటెక్షన్ సర్వీస్ అధికారులు హెచ్చరించారు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా భద్రత అధికారులు ప్రధాని ట్రూడో, ఆయన కుటుంబ సభ్యులను అజ్ఞాత ప్రదేశానికి తరలించారు. ప్రధాని కుటుంబం తమ నివాసాన్ని ఖాళీ చేసిందని కెనడా మీడియా సైతం వెల్లడించింది. హఠాత్తుగా చెలరేగిన ఉద్రిక్తతలతో భద్రత విభాగాలు అప్రమత్తం అయ్యాయి. రాజధానితోపాటు దేశంలోని కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి భద్రతను పటిష్టం చేశాయి.