Idream media
Idream media
కళ్ల ముందు ఇటలీ బీభత్సం ఉంది. అమెరికా కూడా భయంతో వణుకుతోంది. మోడీ జనతా కర్ఫ్యూ పెట్టాడు. ఏం చేసినా మన వాళ్లకు మైండ్ పనిచేయడం లేదు. సీరియస్ నెస్ అర్థం కావడం లేదు. శనివారం సాయంత్రం పోలోమంటూ దుకాణాలపై పడి కరోనా ఫస్ట్ రూల్‌ని అతిక్రమించారు.
ఆదివారం ఐదు గంటలకి చప్పట్లు కొట్టమంటే ఏడో ఘనకార్యం సాధించినట్టు గొర్రెల గుంపుల్లా వీధుల్లో నాట్యం చేశారు. వీళ్లంతా చదువుకున్న వాళ్లే కానీ, బుద్ధి మాత్రం లేదు. ఒక్కరు కూడా మాస్క్ వేసుకోకుండా చిందులేశారు.
సాయంత్రం జగన్, కేసీఆర్ ఇద్దరూ టీవీల్లో కనిపించి 31వ తేదీ వరకు కఠినంగా ఆంక్షల్లో ఉండడం అవసరమని చెప్పారు. రెండు ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. దీనికి తోడు మార్చి నెలలో ఆదాయం సున్నా. వ్యాపారాలు జరిగి ప్రజలు అటోఇటో తిరిగితేనే ప్రభుత్వానికి కూడా డబ్బులొచ్చేది.
ఆదివారం రాత్రే జనం గుంపులుగుంపులుగా కనిపించారు. ఇంట్లోనే ఉండి బోరు కొట్టి వచ్చారనుకుంటే సోమవారం మరీ దారుణం. అనంతపురం లాంటి చిన్న ఊళ్లో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే కరోనాపై మనం చేస్తున్న పోరాటానికి అర్థం ఉందా?
జనం పిచ్చెక్కినట్టు ఏది పడితే అది కొంటున్నారు. సూపర్ మార్కెట్‌లో బిల్లింగ్ దగ్గర దూరం మెయిన్‌టెయిన్ చేయడం లేదు. చాలా షాపులు యధావిధిగా తెరిస్తే పోలీసులు వచ్చి మూయిస్తున్నారు. పోలీసులు అటు వెళ్లగానే వీళ్లు మెల్లిగా తెరుస్తున్నారు.
మనకు మనం స్వీయ నియంత్రణ విధించుకోకపోతే అందరం మునిగిపోతాం. ఒకరిద్దరి నిర్లక్ష్యం ఒక సమూహాన్నే బలి తీసుకుంటుంది. ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే బెడ్స్, వెంటిలేటర్ల కొరత ఏర్పడితే , మన దేశంలో పరిస్థితి అదుపు తప్పితే…చెట్ల కింద పడుకోబెట్టి చచ్చిపోతే ఆ చెట్టు కిందే కాల్చేస్తారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగితే ఆడవాళ్లకి బెడ్లు లేక నేల మీద పడుకోబెట్టిన దృశ్యాలు ఎన్నో చూశాం. ఒకే బెడ్‌ని ఇద్దరు గర్భిణీలకు కేటాయించే ఆస్పత్రులు మనవి. వీల్ చెయిర్ లేక రోగుల్ని చేతులతో ఎత్తుకుని వెళ్లడం కళ్లారా చూస్తున్నాం.
డాక్లర్లు, ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని స్థితి. చాలా కాలంగా ప్రజా ఆరోగ్యాన్ని కార్పొరేట్ ఆస్పత్రులకి అప్పజెప్పేశాం.
ప్రభుత్వాధినేతలు, ప్రసార సాధనాలు , ప్రముఖులు నెత్తినోరూ మొత్తుకున్నా వినకపోతే మీకు కరోనా రావడమే కరెక్ట్!