iDreamPost
android-app
ios-app

Penukonda – Volunteer : టీడీపీ తరఫున కౌన్సిలర్‌గా వలంటీర్‌.. బాబు ఇప్పుడు ఏమంటారు..?

Penukonda – Volunteer : టీడీపీ తరఫున కౌన్సిలర్‌గా వలంటీర్‌.. బాబు ఇప్పుడు ఏమంటారు..?

ప్రజలకు సేవలందించండి.. రాబోయే రోజుల్లో మీరే వారి ప్రతినిధులు అవుతారు… అంటూ వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన సమయంలో వారిని ఉద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ అన్నట్లుగానే.. చాలా మంది వలంటీర్లు పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులుగా, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న మినీ మున్సిపల్‌పోరులోనూ పలువురు వలంటీర్లు.. పోటీ చేస్తున్నారు. అందులో అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ 8వ వార్డు నుంచి వలంటీర్‌ సబీరాబాను పోటీ చేస్తోంది.

సబీరాబాను పోటీ చేయడంలో విశేషం ఏమీ లేదు. ఆమె మాదరిగా చాలా మంది మొన్నటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే ఇక్కడ ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆమె పోటీ చేస్తుంది వైసీపీ తరఫున కాదు.. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం తరఫున. మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి నుంచి ఆమె టీడీపీ బీఫాం కూడా అందుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి ఆ పార్టీ నేతల వరకు అందరికీ నమ్మశక్యం లేకున్నా.. ఇది నిజం. ఈ నెల 15వ తేదీన జరగబోయే పోలింగ్‌లో సబీరాబాను టీడీపీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గెలుస్తారా..? లేదా..? అనేది ఈ నెల 17వ తేదీన తెలుస్తుంది.

గెలుపు, ఓటముల గురించి పక్కనబెడితే.. ఒక వలంటీర్‌ టీడీపీ తరఫున పోటీ చేయడమే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నుంచి నేతల వరకు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే.. వలంటీర్లపై గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అలాంటివి. వలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలేనన్నారు చంద్రబాబు. అంతేకాదు జగన్‌ తన పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించుకుని, నెలకు ఐదు వేల రూపాయల జీతం కూడా ఇస్తున్నాడంటూ విమర్శలు చేశారు. వలంటీర్లు టీడీపీ సానుభూతి పరులకు పథకాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో వారిని దూరంగా పెట్టాలని, వారి వద్ద ఉన్న ఫోన్లు కూడా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కానీ వైసీపీ సర్కార్‌ మాత్రం.. అర్హత ఉన్న వారిని వలంటీర్లుగా నియమించామని చెప్పింది. పార్టీలకు అతీతంగా నియామకలు చేపట్టామని పేర్కొంది. కానీ బాబు ఇవేమి పట్టించుకోలేదు. వలంటీర్లపై వైసీపీ ముద్ర వేస్తూ.. పలుమార్లు విమర్శలు చేశారు. మరి ఇప్పుడు వలంటీర్‌ సబీరాబాను ఏకంగా టీడీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేస్తోంది. టీడీపీ బీఫాం కూడా అందింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏమంటారు..? వలంటీర్లపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా..? లేదా యూ టర్న్‌ తీసుకుంటారా..?