Idream media
Idream media
పెళ్లైన తర్వాత 7 ఏళ్ల వరకు OK. ఆ తర్వాత మగవాడి బుద్ధి పక్కదారి పడుతుందని ఒక థియరీ. జార్జ్ యాక్సెల్‌రాడ్ , న్యూయార్క్‌లో నాటక రచయిత. ఈ కథలో The Seven Year Itch అని ఒక నాటకం రాసి బ్రాడ్‌వేలో ప్రదర్శిస్తే సూపర్ హిట్. అదే పేరుతో 1952లో సినిమా తీస్తే బంపర్ హిట్. మార్లిన్ మన్రో అందానికి జనం పరవశులై పోయారు.
మాయాబజార్ లాంటి సూపర్‌డూపర్ హిట్ తీసిన కేవీ రెడ్డికి ఈ సినిమా తెగ నచ్చేసింది. కథ చేయమని పింగళి నాగేంద్రరావుకి చెప్పారు. హీరో పర స్త్రీ ఆకర్షణకు గురయ్యే లైన్ మాత్రమే తీసుకుని కథా మాటలు స్క్రీన్ ప్లే రెడీ అయ్యింది. అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదన్‌రావుకి వినిపించారు. ANR ముగ్గురు పిల్లల తండ్రి, పైగా పరస్త్రీ వ్యామోహం ఇదంతా హీరోకి డ్యామేజీ, కుదరదు పొమ్మన్నాడు.
కేవీరెడ్డికి నచ్చింది. ANRకి నచ్చింది. సొంతంగా తీస్తే …రెడ్డి మొండి మనిషి, మనసులో పడితే అంతే. పఠాభి రామిరెడ్డి తోడుగా నిలిచాడు. (సంస్కార నిర్మాత, ఆయన భార్య స్నేహలతారెడ్డి ఎమర్జెన్సీలో హింసకు గురై అనారోగ్యంతో మరణించారు)
సినిమాకి భార్యాభర్తలు అని టైటిల్ పెట్టారు. అయితే ఆ పేరుతో ఇంకో సినిమా వస్తుండడంతో పెళ్లినాటి ప్రమాణాలు అని మార్చారు. ANR , జమున ,SVR , రమణారెడ్డి, ఆర్.నాగేశ్వరరావు, రాజసులోచన ముఖ్య నటులు. తమిళంలో కూడా వీళ్లతోనే తీశారు. అయితే R.నాగేశ్వరరావుకి బదులు నంబియార్ నటించారు.
కథ సింపుల్. ANR, జమున ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ముగ్గురు పిల్లలు పుడుతారు. భర్తకి కాస్త సరదాగా తిరగాలని కోరిక. భార్యకేమో పిల్లలతో సతమత. కాస్త అసంతృప్తితో ఉన్న వ్యక్తికి లైఫ్‌లో చిన్నమార్పు. ఆఫీస్‌లో కొత్తగా అమ్మాయి చేరుతుంది. మొదట్లో బిడియంగా ఉంటాడు. తర్వాత ఆకర్షణ. అమ్మాయికి మనసులో దురుద్దేశాలు ఉండవు కానీ, మగవాళ్లని ఆట పట్టించే స్వభావం.
ఈ అంశంలో ఎక్కడా Over లేకుండా 1958లో తీశారంటే అది కేవీ రెడ్డి ప్రతిభే. తమిళ వెర్షన్ 1959లో వచ్చింది. తెలుగులో Above Average , తమిళ్‌లో Average. నష్టాలు రాకుండా ఎలాగో గండం గట్టెక్కారు.
ఘంటశాల సంగీతంలో వెన్నెలలోన వేడి ఏలనో హిట్ సాంగ్. మిగిలినవి అంతంత మాత్రమే. నాగేశ్వరరావు కృష్ణుడి వేషంలో రెండు పాటలు పాడుతాడు. ఇది కొంచెం టార్చరే.
జమున అమాయకత్వం, రాజసులోచన హస్కీ వాయిస్ అద్భుతం. SVR, రమణారెడ్డి గురించి కొత్తగా చెప్పేదేముంది. విలన్ వేషాలు వేసే ఆర్.నాగేశ్వరరావు సాఫ్ట్ రోల్ వేశాడు. అల్లు రామలింగయ్య, చదలవాడ, బాలకృష్ణ, పేకేటి ఉన్నా, మాయాబజార్‌లో లాంటి హిలేరియస్ సీన్స్ లేవు. నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఈ సినిమా సరదాగా ఉంటుంది.