iDreamPost
android-app
ios-app

పెగాస‌స్ స్పై వేర్.. పార్ల‌మెంట్ ను కుదిపేసిన సైబ‌ర్ వార్

పెగాస‌స్ స్పై వేర్.. పార్ల‌మెంట్ ను కుదిపేసిన సైబ‌ర్ వార్

పెగాస‌న్ స్పైవేర్.. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. దీన్ని ఉప‌యోగించి ప్ర‌ముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నార‌ని, దీని వెనుక కేంద్ర‌ ప్ర‌భుత్వ హ‌స్తం ఉందంటూ హ‌స్తం పార్టీ చేస్తున్న ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నంగా మారాయి. అయితే, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఒక్కరోజు ముందే పెగాసస్‌ నిఘాపై వార్తాపత్రికల్లో కథనాలు రావడం ఏంటి? అంటూ కేంద్రం అనుమానం వ్య‌క్తం చేయ‌డం మ‌రో కోణం. ‘‘ఈ పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను మీ కూతురి ఫోన్‌లోనో, భార్య ఫోన్‌లోనో ఇన్‌స్టాల్‌ చేయొచ్చు. మీరు వాష్‌రూమ్‌లో ఉన్నా, బెడ్‌రూమ్‌లో ఉన్నా.. మీరు మాట్లాడే మాటలు, మీ భార్య, కుమార్తె, మీ కుటుంబం మాట్లాడే మాటలన్నింటినీ మోదీ సర్కారు వినగలదు’’ అంటూ కాంగ్రెస్ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇలా ఎవ‌రి ప్ర‌ణాళిక‌ల్లోనూ లేని అంశం.. అస‌లు అంశాల‌ను ప‌క్క‌న‌బెట్టి తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది.

అస‌లేంటీ పెగాస‌స్ స్పై వేర్

ఇజ్రాయిల్ కు ఎన్ఎస్ఓ గ్రూప్ అనే సంస్థ ఈ పెగాస‌స్ స్పై వేర్ ను అభివృద్ధి చేసింది. ఈ స్పై వేర్ వాట్స‌ప్ సందేశాల‌ను చ‌ద‌వ‌గ‌ల‌దు. కాల్స్ ను ట్రాక్ చేయ‌గ‌ల‌దు. లొకేష‌న్ ట్రేస్ చేస్తుంది. మైక్రో ఫోన్ ద్వారా సంభాష‌ణ‌లు విని రికార్డు చేస్తుంది. ప్ర‌భుత్వాలు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు ఈ సాఫ్ట్ వేర్ ను విక్ర‌యిస్తారు. క్రిమిన‌ల్స్, ఉగ్ర‌వాదుల‌ను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌భుత్వాలు దీన్ని ఉప‌యోగిస్తుంటాయి. సైబ‌ర్ ఆయుధంగా నిపుణులు దీన్ని వ‌ర్ణిస్తుంటారు. 2016లో ఇది తొలిసారిగా వెలుగులోకి వ‌చ్చింది. ఐఫోన్ యూజ‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ కు పాల్ప‌డుతున్న‌ట్లు అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి. అప్పుడు యాపిల్ అప్ డేట్ వ‌ర్ష‌న్ ను విడుద‌ల చేసింది.

Also Read:పోలవరం: జగన్ చేసి చూపిస్తున్నాడు

రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌ల‌క‌లం

ఇది జ‌రిగిన ఏడాదికి మ‌రో వెర్ష‌న్ వెలుగులోకి వ‌చ్చింది. పెగాస‌న్ కు ఐఫోన్ల‌తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను కూడా హ్యాక్ చేసే సామ‌ర్థ్యం ఉంద‌ని తేలింది. 2019లో భార‌త్ లో ఈ స్పైవేర్ క‌ల‌క‌లం రేగింది. త‌మ వాట్స‌ప్ కు వ‌చ్చిన కొన్ని తెలియ‌ని సందేశాల ద్వారా పెగాస‌స్ ను త‌మ ఫోన్ లోకి చొప్పించార‌ని కొంద‌రు ప్ర‌ముఖులు అప్ప‌ట్లో ఫిర్యాదులు చేశారు. త‌మ యూజ‌ర్ల గోప్య‌త‌న‌కు భంగం క‌లుగుతోందంటూ ఫేస్ బుక్ రెండేళ్ల క్రితం ఎన్ఎస్ ఓపై కేసు కూడా న‌మోదు చేసింది. తాజాగా ఈపెగాస‌స్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఈ స్పైవ్ వేర్ తో హ్యాకింగ్ గురైన వారి డేటాబేస్ ఒక‌టి ఇటీవ‌ల లీకైంది. ఈ సాఫ్ట్ వేర్ ను త‌యారుచేసిన సంస్థ ఈ వార్త‌ల‌ను ఖండిస్తోంది. తాము మంచి ప‌నుల కోస‌మే దీన్ని రూపొందించామ‌ని, వ‌చ్చిన వార్త‌ల‌న్నీ నిరాధార‌మైన‌వ‌ని ఎన్ఎస్ఓ గ్రూప్ చెబుతోంది.

నిజంగా హ్యాక‌య్యాయా?

కేంద్రమంత్రులు, పాత్రికేయులు సహా భారత్‌లో 300 మందికిపైగా ప్రముఖులపై ‘పెగాసస్‌’ స్పైవేర్‌ ద్వారా నిఘా పెట్టినట్టు పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు ముందు రోజు వార్తా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఇందులో యాభై దేశాల‌కు చెందిన యాభై వేల‌కు పైగా ఫోన్ నెంబ‌ర్లు ఉన్నాయి. ఒక్క భార‌త్ లోనే 300 మందికి పైగా బాధితులు ఉన్నార‌ని, వారిలో అత్యంత ప్ర‌ముఖులు ఉన్నార‌ని ఆ క‌థ‌నాల్లో పేర్కొన్నారు. అయితే, గతంలో కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్నారు. ఈ సంచలన కథనాలకు ఎలాంటి ఆధారాలూ లేవని అంటున్నారు. ఏదో ఒక కన్సార్షియం 50 వేల లీక్డ్‌ ఫోన్‌ నంబర్లను సంపాదించి.. ఆ నంబర్లన్నీ హ్యాకయ్యాయని పేర్కొంటోందని, అవి నిజంగా హ్యాకయ్యాయా? లేక వాటిని హ్యాక్‌ చేసే యత్నం జరిగిందా అనే దానిపై స్పష్టత లేదని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ దీనిపై లోక్‌సభలో ప్ర‌క‌ట‌న చేయ‌డం కొస‌మెరుపు.

Also Read: ఐపీఎస్ ప్ర‌వీణ్‌కుమార్ రాజీనామా వెనుక‌..?

అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్

పెగాస‌స్ పై వెలువ‌డిన వార్తలపై కాంగ్రెస్ తీవ్ర దుమారం రేపుతోంది. విదేశీ (ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో) సంస్థకు ఈ డేటా (భారత ప్రముఖుల సమాచారం) అందుబాటులో ఉంచడం దేశ ద్రోహమని, దేశభద్రతకు విఘాతం కలిగించడమేనని మండిపడుతోంది. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులు, హక్కుల నేతల ఫోన్లను చట్టవిరుద్ధంగా హ్యాకింగ్‌కు గురైన నేపథ్యంలో.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ప్రధాని మోదీపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. పెగాస‌స్ ను ఓ ఆయుధంగా చేసుకుని మోదీపైనా, కేంద్ర ప్ర‌భుత్వంపైన విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతోంది.

ప్ర‌తిప‌క్షాల వ్యూహాత్మ‌క భేటీ

‘‘మోదీ ప్రభుత్వం మీ పడగ్గది ముచ్చట్లను కూడా వినగలదు తస్మాత్‌ జాగ్రత్త’’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఈ నిఘా వెనుక ఉన్నది మరెవరో కాదని.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాయేనని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ అంగీకారం లేకుండా ఇది సాధ్యం కాదని కూడా ఆయన పేర్కొన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీని.. ‘భారతీయ జాసూస్‌ (గూఢచారి) పార్టీగా వ్యవహరిస్తారని, గూఢచర్యానికి బీజేపీ పెట్టింది పేరని సూర్జేవాలా ధ్వజమెత్తారు. పెగాసస్‌ రగడ మంగళవారం కూడా పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మోదీ సర్కారును ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు.. మంగళవారం ఉదయం పది గంటలకు ప్రతిపక్షాలన్నీ పార్లమెంటులో వ్యూహాత్మకంగా భేటీ అయి, దీనిపై చర్చించనున్నాయి.