Idream media
Idream media
పెగాసస్ నిఘా వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సమావేశాలు మొదలైన సోమవారం నుంచి పెగాసస్ నిఘా వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు చర్చకు పట్టుబడుతున్నాయి. సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ లోపల, బయటా, దేశ వ్యాప్తంగా పెగాసస్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు జరగాలని రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. దాదాపు ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఈ అంశంపై ఏకతాటిపైకి వచ్చాయి.
రాజకీయంగా పెగాసస్ స్పైవేర్ విషయంలో దుమారం కొనసాగుతున్న తరుణంలో.. మరో వైపు ఈ అంశం న్యాయస్థానాల ముందుకు వెళ్లింది. పెగాసస్ నిఘా అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేత విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పెగాసస్ నిఘా వ్యవహారం తీవ్ర ఆందోళనకరమన్న శర్మ.. ఇది దేశ ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, భద్రతపై జరిగిన ముప్పేట దాడి అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఈ నిఘా పరికరాలు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. దీంతో పెగాసస్ నిఘాపై విచారణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేస్తుందా..? లేదా..? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎస్‌ఎస్‌ఓ సంస్థ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్‌ను బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేసి రాజకీయ ప్రత్యర్థులు, వివిధ రంగాల ప్రముఖులపై నిఘా పెట్టిందనేది ఆరోపణ. ది వైర్, వాషింగ్టన్ పోస్టు పత్రికలు కథనాలు ప్రచురించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాహల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్, ఓ న్యాయమూర్తి, పలువురు జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, వ్యాపార ప్రముఖులపై పెగాసస్ నిఘా పెట్టిందనేది ఆ కథనాల సారాంశం. ప్రత్యర్థుల కదలికలను, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. బీజేపీ వ్యూహాలు రచించిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే కథనం వెలువడడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి.
Also Read : పెగాసస్ నిఘా.. నెక్ట్స్ ఏంటి..?