Idream media
Idream media
దేశ రాజకీయాల్లో పెగాసస్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో దుమారం రేగుతూనే ఉంది. పెగాసస్ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఉభయసభల్లో కార్యకలాపాలు ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. పలుమార్లు సభలు వాయిదాలు పడుతున్నాయి. సమావేశాలు గత సోమవారం ప్రారంభం కాగా.. ఇప్పటి వరకూ చెప్పకోదగ్గ పనితీరు ఏ మాత్రం కనపడడం లేదు.
జాబితాలో కొత్త అనుమానాలు..
పెగాసస్‌పై స్పందించేందుకు, పార్లమెంట్‌లో చర్చించేందుకు బీజేపీ ప్రభుత్వం వెనుకంజవేస్తున్న తరుణంలో.. ఈ వ్యవహారంపై కొత్త అనుమానాలు చెలరేగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, సామాజికకార్యకర్తలు, జర్నలిస్టులు సహా పలు రంగాల ప్రముఖలపై బీజేపీ ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయంపై కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం కూలిపోవడానికి పెగాసస్ నిఘానే కారణమనేలా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ది వైర్, వాషింగ్టన్ పోస్టు మీడియా సంస్థలు ఈ అంశాలను ప్రచురించగా.. వాటిని ఆధారంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల నేతలు మరిన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌నేత చిదంబరం అనుమానం వ్యక్తం చేశారు. పెగాసస్ స్పైవేర్‌తోనే నిఘా పెట్టి 2019లో బీజేపీ గెలిచి ఉంటుందని ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.
Also Read : లోక్‌సభ సభ్యుల సంఖ్యను 545 నుంచి 1000కి పెంచడం సాధ్యమా..?
తగ్గుతాయనుకుంటే.. పెరిగాయి..!
చిదంబరంతో పలువురు మాట కలుపుతున్నారు. ఇందుకు పలు అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు విఫలమవడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతరిస్తుందని, మూడు లక్షల కోట్ల రూపాయల పెద్ద నోట్లు తిరిగి రావని, ఆ నగదుతో అభివృద్ధి చేస్తామని మోదీ ప్రకటించారు. అయితే చివరకు 99.99 శాతం నోట్లు తిరిగి వచ్చాయి. మిగతా 0.01 శాతం తిరుమల, అన్నవరం వంటి దేవస్థానాల్లో నిలిచిపోయాయి. మరి మోదీ చెప్పిన మూడు లక్షల కోట్ల రూపాయల పెద్ద నోట్లు ఎక్కడ..? అనే సందేహం అందరిలోనూ కలిగింది. పెద్ద నోట్లు మార్చుకునేందుకు పేదలు, సామాన్యులు మాత్రమే బ్యాంకు క్యూలైన్లలో నిలబడ్డారు. ఈ క్రమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ధనవంతులు, రాజకీయ నేతలు ఎక్కడ బ్యాంకు క్యూలలో కనిపించలేదు. కనీసం కార్పొరేటర్ కూడా క్యూలైన్లలో కనిపించలేదంటే.. వారందరూ తమ వద్ద ఉన్న నగదును ఎలా మార్చుకున్నారంటూ సామాన్యులు ప్రశ్నలు సంధించారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల నగదు చెలామణి తగ్గిపోయి.. చిరు వ్యాపారుల నుంచి రియల్‌ఎస్టేట్‌వ్యాపారుల వరకూ ప్రతి ఒక్కరూ నష్టపోయారు. 2016 నవంబర్ లో మొదలైన పెద్ద నోట్ల ప్రభావం 2018 వరకూ కొనసాగింది. దీంతోపాటు నల్లధనం తీసుకువచ్చి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్న 2014 ఎన్నికల హామీని నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో బీజేపీ నష్టపోతుందనే విశ్లేషణలు సాగాయి. అయితే ఇందుకు భిన్నంగా 2014లో 282 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈ సారి 303 సీట్లు గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
పెగాసస్‌ను ఉగ్రవాదులు, నేరస్తులపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వాలకు విక్రయిస్తామని తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ చెప్పడంతో.. భారత్ ఈ స్పైవేర్‌ను కోనుగోలు చేసిందని పరోక్షంగా చెప్పింది. ఈ నేపథ్యంలో తాము పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేయలేదని చెప్పేందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చేందుకు పార్లమెంట్ సంయుక్త కమిటీ లేదా సుప్రిం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుండడంతో ఈ వ్యవహారంపై మరిన్ని అనుమాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది చూడాలి.
Also Read : ప్రజల కోసమే పెగాసస్ తెచ్చారట