Idream media
Idream media
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత భారత మీడియాలోకి రాజకీయం ప్రవేశించింది. మీడియాను రాజకీయాలు ప్రభావితం చేయడం ప్రారంభమైంది. మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. ఫలితంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చర్యలను మీడియా గట్టిగా ప్రశ్నించలేకపోయింది. కొన్ని మీడియా సంస్థలు ప్రశ్నించినా, కథనాలు ప్రచురించినా ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. భారత మీడియా ఇలాంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో.. అంతర్జాతీయ మీడియా భారత్‌లోని అంశాలపై పరిశోధనాత్మక కథనాలు రాస్తూ.. భారత రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ పెగాసస్ నిఘా వ్యవహారం.
ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులపై నిఘా పెట్టే.. ఇజ్రాయోల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌ను భారత ప్రభుత్వం కొనుగోలు చేసి.. దానిని తన రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ అవసరాల కోసం వినియోగించిందంటూ గత ఏడాది అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. గత ఏడాది జూలైలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఈ కథనాలు రావడంతో.. భారత్‌లో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ఈ అంశంపై చర్చించాలని, దర్యాప్తు చేయించాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేయడం, ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయకుండా ఉండడంతో.. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదం పొందాయి.
అటు పార్లమెంట్‌లోనూ, ఇటు బయట కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఈ అంశంపై మౌనంగానే ఉన్నారు. ఫలితంగా ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రజల భద్రతకు సంబంధించిన విషయం కావడంతో సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ పెగాసస్ ఆరోపణలపై కేంద్రం నోరు మెదపలేదు. ఇది దేశ భదత్రకు సంబంధించిన విషయం అంటూ తప్పించుకుంది. దీంతో ఈ అంశంపై నిజానిజాలు తేల్చేందుకు సిద్ధమైన సుప్రీం కోర్టు.. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని గత ఏడాది అక్టోబర్‌లో నియమించింది.
ఈ కమిటీ దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే తాజాగా అమెరికాకు చెందిన మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్.. పెగాసస్ ను కొనుగోలుపై మరో కథనం రాసింది. 14 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 2017లో పెగాసస్‌ను భారత్ కొనుగోలు చేసింది నిజమేనంటూ ప్రచురించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అంతకు రెండు రోజులు ముందు న్యూయార్క్ టైమ్స్ ఈ కథనం రాయడంతో ఈ సమావేశాల్లో కూడా గందరగోళం నెలకొనే అవకాశం లేకపోలేదు. ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే సాగితే.. అది ప్రజలకు భారీ నష్టం చేకూరుస్తుంది.
గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు, ఇప్పుడు బడ్జెట్ సమావేశాల ముందు.. పెగాసస్‌పై కథనాలు రాయడం వెనుక.. భారత రాజకీయాలను ప్రభావితం చేయాలనేది న్యూయార్స్ టైమ్స్ మీడియా లక్ష్యం కావొచ్చు. మొదటిసారి గత వర్షాకాల సమావేశాల ముందు కథనాలు రాసినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఈ సారి కూడా బడ్జెట్ సమావేశాల ముందు కథనం వెలువడింది. ఈ పరిణామాలను అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు గమనించి.. అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే.. విలువైన పార్లమెంట్ సమయం వృథా కాకుండా కాపాడవచ్చు. పెగాసస్ కొనుగోలు ఆరోపణలపై ముందుగానే స్పష్టత ఇవ్వడం ప్రభుత్వం విధి.. ప్రభుత్వం ప్రకటనకు అనుగుణంగా వ్యవహరించి సమావేశాలు సజావుగా జరిగేలా చూడడం ప్రతిపక్ష పార్టీల బాధ్యత. లేదంటే.. ఈ బడ్జెట్ సమావేశాలు కూడా గత వర్షాకాల సమావేశాల మాదిరిగానే తుడిచిపెట్టుకుపోతాయి.
Also Read : అమెరికా మీడియా ప్రకంపనలు, పెగాసస్ ఇండియా కొన్నది నిజమే అంటూ కథనం…!