iDreamPost
android-app
ios-app

గ‌తంలో నామినేష‌న్ వేసిన‌వారైనా ముందుకొస్తారంటావా..? టీడీపీ నేతల్లో టెన్షన్

గ‌తంలో నామినేష‌న్ వేసిన‌వారైనా ముందుకొస్తారంటావా..?  టీడీపీ నేతల్లో టెన్షన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్థానిక ఎన్నిక‌ల‌పై సందిగ్ధ‌త తొల‌గింది. సుప్రీంకోర్టు తీర్పును గౌర‌విస్తూ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. స‌హృద్భావ వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు జ‌రిగేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు కూడా ప్ర‌క‌టించింది. గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకుని నిధులు రాబట్టుకోవాలని సూచించింది. ధన ప్రవాహం, ఇతర సమస్యలు రాకుండా చట్టాన్ని మార్పు చేశామని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా.. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ స్థానిక ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న నుంచి సుప్రీం కోర్టు తీర్పు వ‌ర‌కూ ఏపీలో ఎన్నో ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ప్ర‌జ‌ల ఆరోగ్యానికే పెద్ద‌పీట వేస్తూ పున‌రాలోచించాల‌ని ప్ర‌భుత్వం ప‌లుమార్లు కోరుతూ వ‌చ్చింది.

దీనిపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తూ ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన తెలుగుదేశం నేత‌లు తెగ స్టేట్ మెంట్ లు ఇచ్చారు. జ‌గ‌న్ కు ఎన్నిక‌లంటే భ‌య‌మ‌ని, వైసీపీ ఎన్నిక‌ల‌కు వెనుక‌డుగు వేస్తోంద‌ని ఆరోపించారు. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ వ‌చ్చింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప్ర‌క‌టించిన రీ షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రుగుతాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కూ భీంకారాలు ప‌లికిన తెలుగుదేశం నేత‌ల‌కు ఇప్పుడు అస‌లు గుబులు మొద‌లైంది. అన్ని స్థానాల‌లోనూ నామినేష‌న్లు వేసేందుకు మ‌న‌కు అభ్య‌ర్థులు దొరుకుతారా..? అని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జిలు స‌త‌మ‌తం అవుతున్నారు.

టీడీపీకి నామినేషన్‌ వేసే వారు కూడా లేరని, చంద్రబాబును హైదరాబాద్‌ నుంచి వచ్చి నామినేషన్లు వేయించుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. వాస్త‌వ ప‌రిస్థితులు కూడా అలాగే క‌నిపిస్తున్నాయి. వాస్త‌వానికి గ‌త ఏడాది మార్చి 7న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. మొత్తం రెండు దశల్లో ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అప్ప‌టికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా ప్ర‌భావం అస్స‌లు లేద‌నే చెప్పొచ్చు. క‌రో్నా నేప‌థ్యంలో ఆంక్ష‌లు కూడా ఏమీ లేవు. దీంతో నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల అవ‌స‌రం లేకుండానే 2129 ఎంపీటీసీ స్థానాలు, 125 జడ్పీటీసీ స్థానాలు వైసీపీ అభ్య‌ర్థులకు ఏకగ్రీవం అయ్యాయి. చాలా స్థానాల్లో టీడీపీ నుంచి నామినేష‌న్లు వేసేందుకు కూడా అభ్య‌ర్థులు దొర‌క‌లేదు. నానా తంటాలు ప‌డి.. స్థానికంగా కొద్దో గొప్పో పేరున్న వారి వెంట ప‌డి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల నామినేష‌న్లు వేయించారు. అయిన‌ప్ప‌టికీ నామినేష‌న్ గ‌డువు ముగిసినా పూర్తి స్థాయిలో తెలుగుదేశం నుంచి దాఖ‌లు కాలేదు.

అప్ప‌టితో పోల్చుకుంటే…

నాటి ప‌రిస్థితుల‌తో పోల్చుకుంటే.. ప్ర‌స్తుతం తెలుగుదేశం ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి మొహం చాటేశారు. ఈ నేప‌థ్యంలో అన్ని చోట్లా అభ్య‌ర్థుల‌కు దొర‌క‌డం ఆ పార్టీకి క‌ష్ట‌మే. సీఎం జ‌గ‌న్ అందిస్తున్న సంక్షేమ పాల‌న ప్ర‌జ‌లను వైసీపీకి ద‌గ్గ‌ర చేస్తోంది. ఈ 7 నెల‌ల కాలంలోనే కాపు నేస్తం, టైల‌ర్ల‌కు స‌హాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ‌ల‌కు ఆర్థిక స‌హాయం, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ మాఫీ, జ‌గ‌న‌న్న విద్యా కానుక‌ వంటి ప‌థ‌కాలు ఏపీలో అందుబాటులోకి వ‌చ్చాయి. వీటి వ‌ల్ల ఆయా వ‌ర్గాల‌కు క‌లిగిన మేలు అంతా ఇంతా కాదు. జ‌గ‌న‌న్న విద్యా కానుక జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు పొందాయి. ఈ ప‌థ‌కాల‌తో దాదాపు ఏపీలోని ప్ర‌తీ కుటుంబం వైసీపీపై అభిమానం పెంచుకున్న‌ట్లు ఆయా కార్య‌క్ర‌మాల ద్వారా వ‌చ్చిన స్పంద‌నను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ ప‌రిస్థితుల్లో టీడీపీ నుంచి పోటీకి దిగినా.. ఫ‌లితం ఉండ‌ద‌నే భావ‌న పెరిగింది. ఈ క్ర‌మంలో గ‌తంలో నామినేష‌న్ వేసిన వారు కూడా ఈ సారి ముందుకు రాక‌పోవ‌చ్చ‌ని పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది.