Idream media
Idream media
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగానే కృషి చేస్తున్నారు. కానీ.. ఆయనను ఓ వైపు ఓటమి భయం వెంటాడుతూనే ఉంది. అందుకే.. ఎన్నికలప్పుడే తప్పా ఎన్నడూ అటువైపు చూడని చంద్రబాబు ఈసారి కుప్పంలో కూడా పదేపదే పర్యటిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం చంద్రబాబుకు కంచుకోట. ఏడుసార్లు ఆయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు దశాబ్దాలుగా కుప్పం వాసులు చంద్రబాబుకు పట్టం కడుతున్నారు. 1989 ఎన్నికల్లో చంద్రబాబు నాటి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటస్వామి నాయుడును ఎదుర్కొని కుప్పంలో తొలి విజయం అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ వస్తున్నారాయన. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళితో పోటీ పడి గెలిచారు. అయితే.. వైసీపీ పోటీలో నిలబడ్డాక.. గతంతో పోలిస్తే చంద్రబాబు మెజార్టీ తగ్గుతూ వచ్చింది.
అదంతా ఒక ఎత్తయితే.. ఇటీవల స్థానిక ఎన్నికల ఫలితాలను చూస్తే కుప్పంలో టీడీపీ హవా తగ్గుతోందనే విషయం స్పష్టమవుతోంది. ఏకంగా కుప్పం మున్సిపాల్టీలో కూడా ఓటమి పాలైంది. అది టీడీపీకి, ప్రత్యేకించి చంద్రబాబుకు బాగా పెద్ద దెబ్బగా మారిపోయింది. ఓ విధంగా బాబులో భయం కలుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉంటుందనే అనుమానాలు పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అనుమానాలు ఇలా ఉంటే.. కుప్పం వైసీపీ ఇన్‌చార్జి గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూకుడు ఆ పార్టీలో మరిన్ని భయాలు కలిగిస్తోంది.
Also Read : చంద్రబాబుకు మరోసారి స్టే పొడిగింపు
2004 ఎన్నికల్లో చంద్రబాబుకు 60 వేల ఓట్ల మెజార్టీ రాగా, మొన్నటి ఎన్నికల్లో కేవలం 30 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ లెక్కలు బేరీజు వేసుకుని గట్టి ప్రత్యర్థిని కుప్పం బరిలో దింపితే బాబు ఓటమి ఖాయమని పెద్దిరెడ్డి బలంగా నమ్ముతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికలప్పుడే చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి వచ్చే వారని తెలిపారు. ఇప్పుడు గ్రామాలు కూడా తిరగాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు.
ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా కుప్పంలో చంద్రబాబు పర్యటించని గ్రామాలు చాలా ఉన్నాయన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో మేమంతా గ్రామాలు తిరుగుతున్నామని వివరించారు. కేవలం ఒడిపోతామన్న భయంతో, అభద్రతా భావంతోనే చంద్రబాబు 3 రోజుల కుప్పం పర్యటన అంటూ ఎద్దేవ చేశారు.చంద్రబాబు కుప్పం బాటపట్టడం తమ నైతిక విజయం అంటూ పెద్దరెడ్డి తెలిపారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పంలో గెలవడని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. కుప్పంలో గెలిచే పరిస్థితి లేకుండా చూస్తామని కచ్చితంగా చెబుతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో సేమ్ టు సేమ్ ప్రకటన చేసిన పెద్దిరెడ్డి చెప్పింది చేసి చూపించారు. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీ జెండా ఎగురవేస్తామని ఛాలెంజ్ లు చేస్తున్నారు. దీంతో ఇప్పటి నుంచే కుప్పం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
Also Read : కుప్పంపై బాబు ప్రేమ.. వదిలిపెట్టి పోరట..!