Idream media
Idream media
రాయలసీమ వర్షాధార ప్రాంతాలలోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఆయా ప్రాజెక్టులు నిండి పొంగిపొర్లుతుండడంతో అన్నదాతల మోముల్లో చిరునవ్వు వెల్లివిరుస్తోంది. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలలోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు ఇటీవల కురిసిన వర్షాలకు నిండుగా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కొత్తల గ్రామం వద్ద ఉన్న పెద్దేరు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. 1976లో నిర్మాణం ప్రారంభమై, 1980లో పూర్తయిన ఈ ప్రాజెక్టులో 0.47 tmc ల నీరు నిల్వ చేయొచ్చు. ఈ ప్రాజెక్టుకు కుడి ఎడమ కాలువలు ఉన్నాయి. తంబళ్లపల్లి, పెదమాణ్యం మండలాల్లో 4,600 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాంతంలోని రైతులు ప్రాజెక్ట్ లలో సరిపడా నీళ్లు ఉంటే వరి సాగు చేస్తారు. వరి తరువాత ఎక్కువగా సన్ ఫ్లవర్ ,టమోటా సాగు చేస్తారు , ప్రాజెక్టు నిండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Also Read : కృష్ణా ,గోదావరి బోర్డులకు చీఫ్ ఇంజినీర్ల నియామకంతో తొలి అడుగులు
కరువు సీమలో ప్రవహించే మరో నది పాపాఘ్ని. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడే ఈ నదిలో జల ప్రవాహం ఉంటుంది. కర్ణాటకలో పుట్టిన ఈ నది చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ నది పొంగి ప్రవహిస్తోంది. ఈ నదిపై నిర్మించిన ప్రాజెక్టులు అన్నీ నిండాయి . విజయనగర రాజులు నిర్మించిన వ్యాసరాయ సముద్రం చెరువు, ఈ చెరువునిండిన తర్వాత చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టుకు, అక్కడ నుంచి పెడబల్లి ప్రాజెక్టుకు అక్కడ నుంచి వెలిగల్లు ప్రాజెక్టు కు పాపాఘ్ని నది జలాలు వస్తాయి.
అనంతపురం జిల్లా తనకల్ మండలం ముండ్లవారి పల్లె గ్రామంలో చెన్నరాయనస్వామి గుడి ప్రాజెక్టును 1954లో నిర్మించారు. 0.17 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ద్వారా కుడి, ఎడమ కాలువల నుంచి 900 ఎకరాలకు సాగునీరు అందుతోంది. జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును ఆధునీకరించారు.
పాపాఘ్ని నదిపై ఉన్న మరో ముఖ్యమైన ప్రాజెక్టు వెలిగల్లు. వైఎస్సార్ కడప జిల్లా గాలివీడు మండలం, వెలిగల్లు గ్రామం వద్ద 4.64 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టును నిర్మించాలని 1995లో ప్రతిపాదనలు రూపొందించారు. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను పట్టాలెక్కించారు. 24 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు 2008లో పూర్తయింది.
పెద్దేరు ప్రాజెక్టు నిండి ఆ జలాలు పాపాఘ్ని నదిలో కలుస్తుండడంతో ఈ ప్రాజెక్టుకు మరింత జలకళ సంతరించుకుంది. సాగునీటితోపాటు రాయచోటి పట్టణానికి తాగునీరు కూడా అందించే వెలిగల్లు ప్రాజెక్టు నిండిన తర్వాత.. పాపాఘ్ని నదీ జలాలు గండి ఆంజనేయస్వామి గుడి మీదుగా ప్రవహించి కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తాయి.
దాదాపు 25-30 సంవత్సరాల తరువాత చిత్తూరు, కడప జిల్లాలలోని ప్రాజెక్టులు నిండటంతో ప్రజలు సంబరంగా చూస్తున్నారు. గత సంవత్సరం పింఛా ప్రాజెక్ట్ కు గండి పడగా, చెయ్యేరు మీద ఉన్న అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్ కొట్టుకొని పోయింది.. ఆ ప్రాజెక్టుల నిర్మాణం తరువాత అంత పెద్ద వరద రావటం మొదటిసారి.
Also Read: తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?
కదిరి నియోజకవర్గంలోని తనకల్ మండల లో వందమనేరు మీద ఒక చిన్న ప్రాజెక్ట్ కు ప్రతిపాదించారు కానీ ఫైనాన్సియల్ గా వయబుల్(పర్ కాస్ట్ రేషియో ) కాదని చంద్రబాబు హయాంలో తిరస్కరించారు .మారిన పరిస్థితుల రీత్యా ప్రభుత్వం వందమానేరు ప్రాజెక్ట్ ను నిర్మాణం చేపట్టాలి. వందమానేరు వాగు పాపాఘ్ని నదిలో కలుస్తుంది. వందమానేరు ప్రాజెక్టు నిర్మించి కుడి వైపు గేట్లు పెడితే కదిరి వరకు నీరు ఇవ్వడమే కాకుండా మద్దిలేరు లో కలుస్తుంది.
పింఛా, ఝరికోన , బహుదా, వెలిగల్లు , పెద్దేరు, చెన్నారాయస్వామి గుడి (CG ) ప్రాజెక్ట్, యోగి వేమన మద్దిలేరు ప్రాజెక్ట్, సగిలేరు, అన్నమయ్య , బుగ్గవంక లాంటి చిన్న, చిన్న ప్రాజెక్టులు నిండటంతో చిత్తూరు, కడప, అనంతపురంజిల్లాల్లోని చాలా ప్రాంతాలలో వ్యవసాయం జోరుగా సాగుతుంది.. రైతన్న పొంగళ్ళు పెట్టి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.