iDreamPost
android-app
ios-app

నడిరోడ్డులో,అందరూ చూస్తుండగా హత్యలు..ఎంటీ వైపరీత్యం ?

నడిరోడ్డులో,అందరూ చూస్తుండగా హత్యలు..ఎంటీ వైపరీత్యం ?

ఆ దంపతులు ఇద్దరూ హైకోర్టు న్యాయవాదులు. ఓ కేసు విషయంలో మంథని కోర్టుకు వెళ్లి కారులో హైదరాబాద్‌ తిరిగి వస్తున్నారు. మరో కారులో వారిని కొందరు వెంబడిస్తున్నారు. మార్గమధ్యలో ఓవర్‌టేక్‌ చేసి ఆ దంపతుల కారును అడ్డగించారు. కారులో ఉన్న న్యాయవాదిని బయటకు లాగారు. కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికారు.. కారులో ఉన్న ఆయన భార్యపైనా కత్తులతో దాడి చేశారు. ఆమె కారులోనే కుప్పకూలిపోయింది.

రక్తసిక్తమై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న న్యాయవాదిని స్థానికులు వివరాలు అడగ్గా తమపై కుంట శ్రీనివాస్‌తో పాటు మరికొందరు దాడి చేశారని, అతనిది గుంజపడగ అని చెప్పడాన్ని కొందరు వీడియో తీశారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో మంథని మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌, అతడి అనుచరులే ఈ హత్యలు చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామగిరి మండలం కల్వచర్ల వద్ద నడిరోడ్డుపై మధ్యాహ్నం జరిగిన ఈ హత్యోదంతం కలకలం రేపింది. హత్యలకు గురైన వారు న్యాయవాదులు కావడంతో సంచలనంగా మారింది.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్నారు. బుధవారం వారిరువురూ హైదరాబాద్‌ నుంచి మంథని కోర్టుకు ఒక కేసు విషయమై వెళ్లినట్లు తెలుస్తోంది. వామ‌న‌రావు చెప్పిన శీను మంథని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు. గుంజపడగ సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయాడు. పెద్దపల్లి జెడ్పి చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రధాన అనుచరుడని తెలుస్తోంది. కుంట శీనుకు వ్యతిరేకంగా వామనరావు కేసు వేశాడని.. ఆ కక్షతోనే కుంట శీను దాడి చేశాడని అనుమానిస్తున్నారు. దాడి నుంచి కారు డ్రైవర్ తప్పించుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు.

గతంలో వామన్ రావు రాజకీయనేతల అవినీతిని ప్రశ్నిస్తూ అనేక కేసులు వేశారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఈ కేసులను ఫైల్ చేశారు. ఆ కక్షతోనే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే తనకు ప్రాణహాని ఉందని… రక్షణ కల్పించాలని వామన్ రావు గతంలో ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. అందరికీ సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదంటూ ఆయన అభ్యర్థనను సర్కార్ తిరస్కరించినట్టు హైకోర్టు సీనియర్ అడ్వకేట్స్ చెబుతున్నారు. వామన్ రావు హత్యను హైకోర్టు అడ్వకేట్స్ ఖండించారు.

ఇదిలా ఉండ‌గా.. హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయ‌వాది దంప‌తులు త‌మ‌కు ప్రాణ హాని ఉన్న‌ట్లు ఇటీవల హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోం ది. జిల్లాలో శీలం రంగయ్య లాకప్‌ డెత్‌పై హైకోర్టులో వామనరావు, నాగమణి పిటిషన్‌ వేశారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ను విచారణ అధికారిగా హైకోర్టు నియమించింది. కేసు వాపస్ తీసుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు వామనరావును బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.

శీలం రంగంయ్య లాకప్‌డెత్‌పై తాము కేసు వేసినందుకు పోలీసులూ వేధిస్తున్నారని, మంథనిలోని అన్ని స్టేషన్లలో తప్పుడు కేసులు నమోదు చేశారని వివరించారు. మంచిర్యాలలో తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని సీజేకు విన్నవించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధి సహా మరే కేసులోనూ విచారణకు హాజరవ్వాలంటూ వామనరావు దంపతులను పిలవరాదని గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 9 వరకు పొడిగించింది. విచారణాధికారులు హైదరాబాద్‌ వచ్చి వివరాలు కోరితే సహకరించాలని వామనరావు దంపతులకు సూచించింది.

ఈ నేపథ్యంలో మంథని కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా హత్యకు గురవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకి వ్యతిరేకంగా వామనరావు పలు కేసులు వాదిస్తున్నారు. న్యాయవాది వామనరావు దంపతుల హత్యకు గుంజపడుగులో నెలకొన్న వివాదాలే కారణమని తెలుస్తోంది. అలాగే అదే గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్‌తో నెలకొన్న వివాదాలే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయవాదుల హత్యపై తెలంగాణ బార్ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేడు కోర్టుల విధుల బ‌హిష్క‌ర‌ణ‌కు పిలుపునిచ్చింది.