Idream media
Idream media
జాక్సన్ విల్లీ (ఫ్లోరిడా)లో ఇప్పటికి 7 తెలుగు సినిమాలు చూశాను. ఒక్కదానికి హాల్ నిండలేదు. ఫస్ట్ టైమ్ వకీల్‌సాబ్‌కి హాల్ నిండా జనం. పవన్ కనిపిస్తే ఈలలు, కేకలు కూడా వేశారు. ఆయన స్టామినా అది.
పింక్ సినిమా అద్భుతం. దాని తెలుగులో తీయడం కష్టమని అనిపించింది. కానీ తీశారు. విషయాన్ని చెబుతూనే పవన్ హీరోయిజం మిస్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ఇది వకీల్‌సాబ్ కాదు పవన్‌సాబ్. నిజానికి ఈ కథలోనే బలం ఉంది. హీరో ఎవరైనా ఎంతోకొంత ఆడుతుంది. అయితే ఒక సమస్యని బలంగా Expose చేయాలనుకుంటే అంతే బలమైన స్టార్స్ వుండాలి. హిందీలో అమితాబ్ వుండడం ప్లస్ అయినట్టు, తెలుగులో పవన్ ప్లస్ అయ్యాడు. ఇదే సినిమాని చిన్న నటులతో తీస్తే జనాలకి అంత సులభంగా ఎక్కదు.
నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా… ఆడపిల్లలపై ఆంక్షలు ఎక్కువ. 1970 నాటికి మరీ దుర్మార్గం. తల్లిదండ్రులే ఘోరంగా మాట్లాడేవారు. వాడికేం మగపిల్లాడు, నువ్వు ఆడపిల్లవి అని కొడుకులకి, కూతుళ్లకి తేడా చూపించేవాళ్లు. అమ్మాయిలు అణుకువగా ఉండాలి. ఎవడో ఒకడు ఎబ్రాసినీ పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని కనాలి. సమస్యలొస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి కానీ, పుట్టింటి వాళ్ల పరువు తీయకూడదు. పీరియడ్స్ వస్తే ఇంట్లోకి రాకూడదు. ముట్టుకోకూడదు. ఖైదీలకి లేదా కుక్కలకి వేసినట్టు ఇంత అన్నాన్ని పల్లెంలో పెట్టేవాళ్లు. ఇది అన్యాయం, వివక్ష అని కూడా గుర్తించలేనంత మూర్ఖత్వం.
కాలం కొంచెం మారింది. అమ్మాయిలకి కూడా చదువు చెప్పించాలనే జ్ఞానం పెరిగింది. అప్పుడు కూడా హైస్కూల్ దాటలేదు. 1978 నాటికి కూడా హాస్టల్ సదుపాయం ఉన్న అమ్మాయిల కాలేజీ అనంతపురం జిల్లా మొత్తం మీద సత్యసాయి ఉమెన్ కాలేజీ ఒక్కటే. మరి పల్లెటూర్లలో ఉన్న అమ్మాయిలు చదువుకోవాలంటే మార్గమే లేదు. 1980 దాటిన తర్వాత జరిగిన ఘోరాలేమంటే స్కానింగ్‌లోనే గుర్తించి ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించడం.
వకీల్‌సాబ్ సినిమాలో పవన్‌కల్యాణ్ ప్లాష్ బ్యాక్‌లా ఇంత సుత్తి ఎందుకు చెబుతున్నానంటే వకీల్‌సాబ్ ప్రధానంగా అమ్మాయిల సమస్యపై తీసిన సినిమా కాబట్టి. 2021కి కూడా సమస్య ఏమీ మారలేదు. అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్‌లు వేసుకవాలి, ప్రేమికుల రోజు జరుపుకోవాలా?వద్దా? అని కొందరు నిర్దేశిస్తున్నారు కాబట్టి. పార్కుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కనిపిస్తే పెళ్లి చేస్తామని హెచ్చరించే ఉన్మాదులు పెరిగారు కాబట్టి.
నాకు అమెరికా అంటే కోపం, ద్వేషం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టు సాహిత్యం చదివాను కాబట్టి. కమ్యూనిస్టుల ప్రత్యేకత ఏమంటే అమెరికాని దారుణంగా ద్వేషించడం. సామ్రాజ్యవాద బూర్జువా యుద్ధ ఉన్మాద ఇలా అమెరికా గురించి మనకి నూరిపోస్తారు.
అయితే ఆడపిల్లల హక్కుల విషయంలో అమెరికా అంటే నాకు గౌరవం. 5 నెలల క్రితం అమెరికా వచ్చాను. ఇక్కడ ఆడమగా వివక్ష లేదు. అన్ని రకాల ఉద్యోగాలు, వృత్తుల్లో అమ్మాయిలున్నారు. పెద్దపెద్ద ట్రక్కుల్ని ఆడవాళ్లు సులభంగా నడిపేస్తున్నారు. మన దేశంలో మహిళలు డ్రైవర్లగా ఉంటే అదో న్యూస్. క్యాబ్ డ్రైవర్లు లెక్కలేనంత మంది.
ఈ మధ్య మా కమ్యూనిటీలో ఎవరో కొత్తగా ఇంట్లో చేరితే ట్రక్కులోంచి సామాన్లు మోసింది ఆఫ్రో అమెరికన్ అమ్మాయిలే. అర్ధరాత్రి Take away తీసుకోడానికి (ఇక్కడ to go అంటారు) వెళితే ఆ రెస్టారెంట్లో అందరూ మహిళలే. ఎవరిష్టం వచ్చిన డ్రెస్ వాళ్లు వేసుకుంటారు. డ్రెస్ కోడ్‌ని నిర్దేశించే పండితులు లేరు.
సెంట్ అగస్టీనా అనే పిక్నిక్ స్పాట్‌కు వెళితే అమ్మాయిలు రకరకాల డ్రెస్‌ల్లో ఉన్నారు. వాళ్లని వెకిలిగా మాట్లాడే వాళ్లు, ఈలలు వేసేవాళ్లు లేరు. మన దేశంలో ఇది సాధ్యమా? మరి సమస్య ఎక్కడుంది? మగపిల్లల బుర్రల్లోనా? ఆడపిల్లల్లోనా?
సినిమాలో లాయర్ పవన్ ఒక మాట అంటాడు
“పురుగు మగ పిల్లల బుర్రల్లో ఉంటే, మందు ఆడపిల్లల మీద చల్లుతారెందుకు?”
పింక్ విపరీతంగా నచ్చింది. వకీల్‌సాబ్ కూడా అంతే నచ్చింది. కారణం ఏమంటే సమస్య అంత తీవ్రమైంది. అమ్మాయిల విషయంలో మాడ్రన్ అనుకునేవాళ్లు కూడా, నిజంగా కానే కాదు. బూజు పట్టిన భావజాలంతోనే ఉన్నారు. ఆసిడ్ దాడులు, రోడ్డు మీద పొడిచి చంపడాలు, ఆడపిల్లల ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే అనుకునే మేధావులున్నారు.
ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. పవన్‌కల్యాణ్ హీరోగా వేస్తే చెప్పాల్సిన పాయింట్ ఇంకా బలంగా వెళుతుంది. ఇక ఫైటింగ్‌లు, హీరోయిజం ఇవన్నీ తప్పవు. ఎందుకంటే కోట్లు పెట్టినప్పుడు పవన్ ఫైటింగ్‌లు చేయకుండా ప్రవచనాలు చెబితే ఫ్యాన్స్ ఊరుకుంటారా?
పవన్ పొలిటికల్ కెరీర్‌కి అనుగుణంగా చాలా డైలాగ్‌లున్నాయి. కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. రాజకీయాలు, సినిమాలు వేర్వేరు. చిరంజీవిని చూసి కూడా పవన్ ఏమీ నేర్చుకోలేదు.
ఈ సినిమాలో అద్భుతంగా నటించింది నివేదా, అంజలి, అనన్య. నిజానికి వాళ్లదే ఈ కథ. అనన్య కూడా మంచి నటే, కానీ ఆమెకి స్కోప్ లేదు. నివేదా ఎక్స్‌ప్రెషన్స్ కొన్ని సీన్స్‌లో మార్వలెస్. అంజలి కన్నీళ్లు తెప్పిస్తుంది. ప్రకాశ్‌రాజ్ బాగా నటించాడు అనడం వెన్నెల గురించి చంద్రుడికి చెప్పినంత అజ్ఞానం. సినిమాకి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఒక మూడ్ క్రియేట్ చేసింది. రీమేక్ అయినప్పటికీ వేణు శ్రీరాం రైటింగ్‌లో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో కోర్టు సీన్స్‌లో తెలుస్తుంది.
నిజానికి మనం మారాలంటే ఇలాంటి కథలు ఇంకా రావాలి. ఎన్ని చూసినా అమ్మాయిలు ఎలా వుండాలో జడ్జిమెంట్లు ఇచ్చే మనస్తత్వం నుంచి అంత సులభంగా బయటికి రాం. ఇక సిస్టం అంటారా? దాన్ని నాశనం చేయడానికి రాజకీయ నాయకు లున్నారు. చట్టాలు చేసేది , దాన్ని పనిచేయకుండా చేసేది కూడా వాళ్లే. సినిమాల్లో కాబట్టి ok. వాస్తవంగా మంత్రులు, ఎంపీల కొడుకులకి శిక్షలు పడగా ఎప్పుడైనా చూశామా?