iDreamPost
android-app
ios-app

Pawan kalyan – ఆల‌స్యంగా మేల్కొంటున్న ప‌వ‌న్..!

Pawan kalyan – ఆల‌స్యంగా మేల్కొంటున్న ప‌వ‌న్..!

ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చానంటూ జ‌న‌సేన‌ను ప్రారంభించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌తీ అంశంపైనా ఆల‌స్యంగా ప్ర‌శ్నిస్తార‌న్న అప‌వాదు ఉంది. నాటి రాష్ట్ర విభ‌జ‌న అంశం నుంచి నేటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ‌ర‌కూ అన్నింట్లోనూ అది క‌నిపిస్తోంది. ఆల‌స్యంగా రంగంలోకి దిగి సున్నిత‌మైన అంశం కాబ‌ట్టి, నేను రంగంలోకి దిగితే ఘోరాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి కాబ‌ట్టి ఇప్ప‌టి వ‌ర‌కూ వేచి చూశానంటూ స్టేట్ మెంట్లు ఇవ్వ‌డం చాలా సంద‌ర్భాల్లో తెలిసిందే. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విష‌యంలో కూడా అదే జ‌రుగుతోంది.

విశాఖ‌ప‌ట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా కేంద్రం అడుగులు వేయ‌డం మొద‌లుపెట్టి దాదాపు తొమ్మిది నెల‌ల‌వుతోంది. నాటి నుంచి నేటి వ‌ర‌కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కార్మికులు పోరాడుతున్నారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు, ప్రభుత్వం కూడా గొంతెత్తింది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. కార్మికుల‌తో కూడా జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేేటీకరణకు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామ‌ని హామీ ఇచ్చి చేసి చూపించారు. తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇటీవ‌ల తిరుప‌తి లో ప‌లు రాష్ట్రాల ముఖ్యుల‌తో స‌మావేశ‌మైన అమిత్ షా ముందు కూడా.. జ‌గ‌న్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని లేవ‌నెత్తారు.

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీక‌రిస్తే జ‌రిగే న‌ష్టాల‌ను, ప్లాంట్ న‌ష్టాల‌ను త‌గ్గించుకునేందుకు ఉన్న మార్గాల‌ను కూడా జ‌గ‌న్ కేంద్రానికి సూచించారు. ప్లాంట్ ను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన ప్లాన్ ను వివ‌రిస్తూ ప్రధాని న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లేఖ కూడా రాశారు. ఆ పార్టీ ఎంపీలంద‌రూ దీనిపై కేంద్ర పెద్ద‌ల‌ను ప‌లుమార్లు క‌లిశారు కూడా. ప్రైవేటీకరణకు భిన్నంగా తన లేఖ ద్వారా ఐదు ప్రత్యామ్నాయాల్ని ఇప్పటికే సీఎం జగన్ చూపించారు. ప్ర‌స్తుత శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కూడా వైసీపీ ఎంపీలు స్టీల్ ప్లాంట్ అంశంపై పోరాడుతున్నారు. కేంద్రాన్ని నిల‌దీస్తున్నారు.

దాదాపు ప‌ది నెల‌లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కార్మికులు, అధికార పార్టీ ఎంపీలు నిర‌స‌న గ‌ళం వినిపిస్తూనే ఉన్నారు. ముఖ్య‌మంత్రి ఏకంగా అసెంబ్లీలో తీర్మాన‌మే చేసి పంపారు. ఓ వైపు.. ఉద్య‌మం కొన‌సాగుతుంటే.. మ‌రోవైపు కేంద్రం మొండిప‌ట్టు వీడ‌కుండా త‌న పంతాన్ని నెగ్గించుకునే ప‌నిలో ముందుకు వెళ్తూనే ఉంది. తాజా స‌మావేశాల్లో కూడా ప్లాంట్ ను అమ్మేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతా అయిపోయాక‌.. జ‌న‌సేనాని ఇప్పుడు దీక్ష‌కు దిగడం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. పైగా.. త‌ప్పు కేంద్రానిది కాదని చెప్ప‌డం మ‌రో విశేషం. అడ‌గ‌క‌పోవ‌డం రాష్ట్రానిదే త‌ప్పంటూ ప‌వ‌న్ పేర్కొన‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు. అసెంబ్లీలో తీర్మానం చేయ‌డం ఆయ‌న‌కు తెలియ‌దా? ప‌లు మార్లు జ‌గ‌న్ లేఖ‌లు రాయ‌డం ఆయ‌న‌కు తెలియ‌దా? ఇటీవ‌ల ద‌క్షిణాది రాష్ట్రాల స‌మావేశంలో కూడా ఈ విష‌యాన్ని లేవ‌నెత్తిన విష‌యం తెలియ‌దా? కార్మికుల‌తో క‌లిసి వైసీపీ ఎంపీలు నేరుగా ఉద్య‌మంలో పాల్గొన్న‌ది తెలియదా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

పైగా.. నెల‌న్న‌ర క్రితం.. ఓ స‌మావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాస్త ప్ర‌శ్నించండి.. అని ప‌లువురు కోరిన‌ప్పుడు ఓట్లేసి న‌న్ను గెలిపించ‌లేదు కానీ.. పోరాడ‌మంటున్నారా అని బ‌హిరంగ వేదిక నుంచే స్ప‌ష్టం చేశారు. దీనిపై భారీ స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతోపాటు ఇప్పుడు ప్లాంట్ అమ్మ‌కానికి కేంద్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాక‌.. ప‌వ‌న్ మేల్కొన్నారు. క‌నీసం ఒక‌రోజైనా ఏదో ఒక‌టి చేయ‌క‌పోతే అది పెద్ద మ‌చ్చ‌గా మిగిలిపోతుంద‌ని భావించిన జ‌న‌సేనాని దీక్ష చేప‌ట్టి, రాష్ట్రాన్నే టార్గెట్ చేయ‌డం కొస‌మెరుపు.