iDreamPost
android-app
ios-app

తేరి రీమేక్ గురించి పవన్ ఫ్యాన్స్ టెన్షన్

  • Published Dec 08, 2022 | 6:42 PM Updated Updated Dec 08, 2022 | 7:57 PM
తేరి రీమేక్ గురించి పవన్ ఫ్యాన్స్ టెన్షన్

పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సరిపడా టైం లేకపోవడంతో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇది అఫీషియల్ గా చెప్పకపోయినా ఆ ప్రాజెక్టు ఇప్పటికిప్పుడు లేదన్నది వాస్తవం. దాని స్థానంలో తేరి రీమేక్ ని తెరకెక్కిస్తారనే వార్త అభిమానుల్లో కలకలం రేపుతోంది. నిజానికిది ఎప్పుడో సిద్ధం చేసిన స్క్రిప్ట్. కానీ కార్యరూపం దాల్చలేదు. విజయ్ తేరి మీద ఇంత టెన్షన్ పడేందుకు కారణం ఉంది. తేరిని తెలుగులో పోలీసోడుగా ఎప్పుడో డబ్బింగ్ చేశారు. దిల్ రాజు రిలీజ్ చేశారు కానీ థియేటర్లలో అనుకున్నంత ఆడలేదు. తర్వాత స్టార్ మా ఛానల్ కు శాటిలైట్ హక్కులు ఇస్తే చాలా సార్లు ప్రసారం చేశారు

అమెజాన్ ప్రైమ్ లో శుభ్రంగా అందుబాటులో ఉంది. సమంతా, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటించగా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ఒరిజినల్ వెర్షన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అలా అని ఇదేమి కొత్త కథ కాదు. ఓ పోలీస్ ఆఫీసర్ లోకల్ విలన్ ని ఎదిరిస్తే అతను హీరో భార్యను చంపేస్తాడు. దీంతో పాపను తీసుకొచ్చి అజ్ఞాతంలో బ్రతుకుతాడు. ఆ తర్వాత మళ్ళీ గతం తాలూకు నీడలు వెంటాడితే మరోసారి ఖాకీ డ్రెస్సు వేసుకుని వాళ్ళ భరతం పడతాడు. ఎన్నోసార్లు వచ్చి అరిగిపోయిన ఫార్ములా ఇది. విజయ్ కాంత్ క్షత్రియుడు స్ఫూర్తితోనే దర్శకుడు ఆట్లీ దీన్ని రాసుకున్నాడు. పవన్ మళ్ళీ ఇదే సబ్జెక్టు చేయడమంటే అనవసరమైన రిస్క్.

గతంలో ఇలాగే అజిత్ వీరం తెలుగులో వీరుడొక్కడేగా వచ్చింది. ఆడలేదు. పవర్ స్టార్ కాటమరాయుడుగా తిప్పి తీసి చేదు ఫలితాన్ని అందుకున్నాడు. ఒకప్పుడు పవన్ కు సుస్వాగతం లాంటి సూపర్ హిట్లు రీమేక్స్ ద్వారా వచ్చినవే. అంతదాకా ఎందుకు గబ్బర్ సింగ్ కూడా హిందీ నుంచి తీసుకున్నదే. కానీ అప్పటికి ఇప్పటికీ జనం బాగా మారిపోయారు. ఓటిటి వచ్చాక భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తున్నారు. అలాంటప్పుడు తేరి లాంటివి ఎన్నుకుని మమ్మల్ని బాధ పెట్టడం ఏమిటని ఫ్యాన్స్ ప్రశ్న. ఇటీవలే ఇదే తరహాలో లూసిఫర్ ప్రైమ్ లో ఉన్నప్పటికీ గాడ్ ఫాదర్ గా వచ్చిన చిరంజీవి టాక్ కు తగ్గట్టు హిట్టు కొట్టకపోవడానికి కారణం ఇదే